● బయటపడిన ముగ్గురు స్నేహితులు
● కరీమాబాద్‌లో విషాదం
ఖిలా వరంగల్: ఈత సరదా ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముగ్గురు స్నేహితులతో కలిసి ఈత వెళ్లిన యువకుడు నీటిలో మునిగి మృతిచెందాడు.. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం వరంగల్ హంటర్ రోడ్డులోని గణపతి కళాశాలకు ఎదురుగా ఉన్న బావిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ 40వ డివిజన్ కరీమాబాద్ ఉర్సు ప్రతాప్‌నగర్ ప్రాంతానికి చెందిన ఆకునూరి రాజేందర్ కుమారుడు మనీష్ (19) అలియాస్ సన్నీ వెల్డింగ్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం మనీష్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి గణపతి కళాశాల ఎదురుగా ఉన్న బావికి ఈతకు వెళ్లారు. బావిలోకి దిగిన నలుగురిలో మనీష్ నీటిలో మునిగిపోయాడు. మిగతా ముగ్గురు యువకులు భయాందోళనకు గురై రోడ్డుపైకి వచ్చి మా స్నేహితుడిని కాపాడండి అంటూ కేకలు వేశారు. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు ఆగి బావి వద్దకు వెళ్లి చూడగా నీట మునిగిన మనీష్ కనిపించలేదు. మిల్స్‌కాలనీ పోలీసులకు సమాచారమివ్వగా.. వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బావిలోనుంచి తీసేందుకు అగ్నిమాపక ఆధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది రాత్రి పొద్దుపోయే వరకు గాలించినా మృతదేహం ఆచూకీ తెలియరాలేదు. మృతుడి తండ్రి రాజేందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు
శ్రీపతిపల్లిలో యువకుడు..
చిల్పూరు: మిత్రులతో కలిసి శుభకార్యానికి వచ్చిన ఓ యువకుడు సరదాగా ఈతకు వెళ్లి నీటమునిగి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం మండలంలోని శ్రీపతిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై నవీన్‌కుమార్ కథనం ప్రకారం.. ర ఘునాథపల్లి మండలం కోమళ్ల గ్రామానికి చెందిన వెలిశాల పెంటమ్మ కుమారుడు భిక్షపతి (34) హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. చిల్పూరు మండలం శ్రీపతిపల్లి గ్రామంలో మిత్రు డి వివాహ విందు ఉండగా ఉదయం గ్రామానికి వచ్చాడు. ఈ సందర్భంగా మిత్రులతో కలిసి మ ద్యం సేవించాడు. అనంతరం మధ్యాహ్న సమయంలో గ్రామ సమీపంలోని బావి వద్దకు ఈతకు వెళ్లారు. మద్యం మత్తులోనే బావిలో దూకాడు. ఎంతసమయమైనా తేలకపోవడంతో మిత్రులు భ యంతో గ్రామంలోకి వెళ్లి గ్రామస్తులకు తెలిపారు. దీంతో వారు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాలించగా అప్పటికే మృతి చెందాడు. కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


