ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
కాశిబుగ్గ: జిల్లాలో వైద్య, ఆరోగ్యశాఖ అందిస్తున్న సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన ప్రగతి–ప్రణాళికలో భాగంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు అధ్యక్షతన మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ సత్యశారద హాజరై ఎంజీఎంలోని నర్సింగ్ కళాశాల నుంచి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఐఎంఏ హాల్‌లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మానవ జీవితం మహోన్నతమైందన్నారు. మానసిక ప్రశాంతత, శారీరక శ్రమ, తగిన ఆహారం సమయానుకూలంగా తీసుకోవాలని కోరారు. వ్యాధులు రావడానికి ప్రధానంగా జీవనశైలిలో మార్పు లేకపోవడమేనన్నారు. వైద్యశాఖ ప్రజలకు అందిస్తున్న సేవలపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. అవగాహన కలిగిన వారంతా వ్యాధులకు గురికాకుండా ఉంటారని పేర్కొన్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ.. వైద్య, ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న ప్రతీ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ శాఖల అధికారులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వైవీ గణేశ్, సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డి, నేత్ర వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ భరత్‌కుమార్, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు, నర్సింగ్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
హౌస్ లిస్టింగ్ పూర్తి చేయాలి
న్యూశాయంపేట: జిల్లాలో ఈనెల 17లోగా జనగణనకు సంబంధించి హౌస్ లిస్టింగ్ బ్లాక్ వారీగా పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి మంగళవారం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. జనగణనకు సంబంధించి ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లను సిబ్బందిని నియమించాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, జిల్లా అధికారులు తహసీల్దార్లు పాల్గొన్నారు.


