● వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
● ఎంజీఎం ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు
కాశిబుగ్గ: పది జిల్లాలకు వైద్యసేవలందించాల్సిన ఎంజీఎం ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హెచ్చరించారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఓపీ విభాగాల్లో రోగులకు అందుతున్న సేవలతోపాటు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విధుల్లో ఉన్న వైద్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ రోజురోజుకూ పెరుగుతున్న రోగుల సంఖ్య నేపథ్యంలో సేవలను మరింత మెరుగుపర్చాలని, వైద్యులు సమయపాలన పాటించాలని సూచించారు. అలాగే, సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డితో సమావేశమయ్యారు. ఇటీవల ఆస్పత్రిలో చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు. ముఖ్యంగా మెడిసిన్ విభాగంలో ఉన్న అలసత్వం, వైద్యుల గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీరోజూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళ ఆర్‌ఎంఓలు తప్పనిసరిగా రౌండ్స్ వేయాలని పేర్కొన్నారు. డ్రగ్స్ టెండర్‌ను ఇంకా పెట్టడం లేదని సూపరింటెండెంట్‌ను ప్రశ్నించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వారం రోజుల్లో డ్రగ్స్ టెండర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తామని సూపరింటెండెంట్ తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అవసరమైన నిధుల కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించి వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులకు సూచించినట్లు ఆయన వివరించారు.


