ఉద్యోగాల భర్తీ ఎప్పుడు?
హసన్‌పర్తి: నీటి పారుదలశాఖలో ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి తొమ్మిది నెలల క్రితం నోటిఫికేషన్ జారీచేశారు. కానీ, ఇప్పటివరకు భర్తీ చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2025, ఏప్రిల్ 1 నుంచి 2026, మార్చి 31 కాలపరిమితిని విధిస్తూ ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వరంగల్ సీఈ పరిధి (వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, జనగామ)లో 239 పోస్టుల(లష్కర్, హెల్పర్)కు దరఖాస్తులు ఆహ్వానించారు. బీటెక్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినవారు సైతం లష్కర్, హెల్పర్ పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా 2,034 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు.
ఉద్యోగాల కోసం పైరవీలు..
ఈ పోస్టుల భర్తీలో జోరుగా పైరవీలు నడుస్తున్నట్లు సమాచారం. మంత్రి, ఎమ్మెల్యేలనుంచి అధికారులకు ఒత్తిడి పెరిగిందన్న చర్చ నడుస్తోంది. ఓ దశలో ఒక్కో పోస్టుకు రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు కూడా డిమాండ్ ఏర్పడింది. కొంతమంది నిరుద్యోగులు డబ్బులు ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చినట్లు తెలిసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని దళారులు డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నీటిపారుదలశాఖలోని కొంతమంది ఉద్యోగులు కూడా పోస్టులు ఇప్పిస్తామని నిరుద్యోగులనుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కాగా, పోస్టుల కాలపరిమితిలో ఇప్పటికే తొమ్మిది నెలల సమయం గడిచిపోయింది. మరో ఐదు నెలల మాత్రమే మిగిలి ఉంది. ఇంకెప్పుడు భర్తీ చేస్తారో తెలియని పరిస్థితి. ప్రభుత్వం స్పందించి వెంటనే ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.
నీటిపారుదల శాఖలో నోటిఫికేషన్ జారీ చేసి తొమ్మిది నెలలు
వరంగల్ సీఈ పరిధిలో
239 పోస్టులు, 2,034 దరఖాస్తులు
లష్కర్ ఉద్యోగానికి, బీటెక్,
పీజీ విద్యార్థుల దరఖాస్తులు
మరో ఐదు నెలలే కాలపరిమితి


