పథకాలు అర్హులకు అందించాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన మహిళలు, పిల్లలకు అందించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్‌లో మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులతో శనివారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆమె పలు సూచనలు చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలు, మిషన్ వాత్సల్య, శిశు సంరక్షణ కేంద్రాలు, బాల్యవివాహాల నిర్మూలన, పోషణ్ అభియాన్, బేటీ బచావో బేటీ పడావో, చైల్డ్ హెల్ప్‌లైన్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవ సేవలపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఇన్‌చార్జ్ డీఆర్డీఓ, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పత్తి యార్డులో సీసీ కెమెరాలు..
వరంగల్: ఏనుమాములలోని వరంగల్ వ్యవసాయ మార్కెట్ పత్తి యార్డులో 18 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈనెల 6వ తేదీన కలెక్టర్ సత్యశారద పత్తి యార్డును సందర్శించిన సమయంలో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, ప్రతిపాదనలు పంపామని చెప్పారు. కలెక్టర్ వెంటనే మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయికి ఫోన్ చేశారు. ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా పత్తి బస్తాల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు వర్షం పడినప్పుడు బస్తాలు తడవకుండా ఉండేందుకు డ్రెయిన్లు నిర్మించేందుకు అనుమతించాలని కలెక్టర్ లేఖ రాశారు. లేఖతో స్పందించిన మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్ వరంగల్ మార్కెట్ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో శనివారం సీసీ కెమెరాల ఏర్పాటు దాదాపు పూర్తి చేశారు. పత్తి యార్డులో పనిచేయని విద్యుత్ బల్బుల స్థానంలో కొత్తవి అమర్చారు. ఏర్పాట్లను మార్కెట్ గ్రేడ్–2 కార్యదర్శి, ఏఎస్ రాజేందర్, సూపర్‌వైజర్ స్వప్న పర్యవేక్షించారు.


