
నేడు గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరపాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ)లో సోమవారం గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం వరకు రాత పూర్వకంగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న గ్రీవెన్స్ సెల్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
న్యూశాయంపేట: ప్రజా సమస్యల పరిష్కారానికి వరంగల్ కలెక్టరేట్‌లో నేడు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్యశారద ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు గ్రీవెన్స్ ఉంటుందని తెలిపారు. జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. శుక్రవారం నుంచి ఆదివారం ఉదయం వరకు 6,619 విగ్రహాల నిమజ్జనం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, అన్నివర్గాల ప్రజలకు సీపీ కృతజ్ఞతలు తెలిపారు.
విద్యారణ్యపురి: జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్)కు 8వ తరగతి చదవుతున్న విద్యార్థులు అక్టోబర్ 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని హనుమకొండ డీఈఓ డి.వాసంతి ఒక ప్రకటనలో కోరారు. జనరల్ విద్యార్థులు ఏడో తరగతి పరీక్షల్లో 55 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మార్కులు సాధించిన వారు అర్హులని పేర్కొన్నారు. ప్రభుత్వ, స్థానిక సంస్థల, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, వసతి సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 23న పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. వివరాలకు హెచ్‌టీటీపీ//బీఎస్‌ఈ.తెలంగాణ. గౌట్.ఇన్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.
రాజ్‌కుమార్‌కు గురుబ్రహ్మ అవార్డు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్ విభాగం ఇన్‌చార్జ్ అధిపతి డాక్టర్ సీహెచ్ రాజ్‌కుమార్‌కు గురుబ్రహ్మ అవార్డు లభించింది. విశాఖపట్నంలోని సెయింట్ మదర్ థెరిస్సా ఆర్గనైజేషన్ ఆయనను అవార్డుకు ఎంపిక చేసింది. ఈమేరకు ఆదివారం విజయవాడలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మదర్ థెరిస్సా ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.కృష్ణమూర్తి, రి టైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ డి.రూథ్‌మేరీ తదితరులు రాజ్‌కుమార్‌కు అవార్డు ప్రదానం చేశారు. ప్ర శంసపత్రం, జ్ఞాపిక అందించి సన్మానించారు.
సండే సందడి
ఖానాపురం: వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని పర్యాటక ప్రాంతమైన పాకాలలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. పాకాల సరస్సు మత్తడి పోస్తుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు పాకాలకు భారీగా తరలివచ్చారు. మత్తడి వద్ద స్నానాలు చేస్తూ పాకాల అందాలను సెల్ఫీ రూపంలో బంధించుకున్నారు. బోటింగ్ చేస్తూ ఉత్సాహంగా గడిపారు.

నేడు గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్