
ఏడాదిగా పెండింగ్‌లోనే..
2023వ సంవత్సరం నుంచి..
● ‘ఓ రిటైర్డ్ తహసీల్దార్ తల్లికి రూ.90 వేలు వైద్య ఖర్చులయ్యాయి. ఇవి మెడికల్ రీయింబర్స్‌మెంట్ కోసం వరంగల్ కలెక్టరేట్‌కు తిరుగుతున్న సమయంలోనూ ఆయన అనారోగ్యం బారిన పడడంతో రూ.50వేల వరకు ఖర్చైంది. తొలుత ఆయా ఆస్పత్రుల్లో అతనే భరించారు. సంబంధిత వైద్య నివేదికలతో మెడికల్ రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఏడాదిగా వరంగల్ కలెక్టరేట్‌లోనే పెండింగ్ ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.’
● ‘ఓ తహసీల్దార్ కుమార్తెకు రోడ్డు ప్రమాదం జరగడంతో సుమారు రూ.మూడు లక్షల వరకు వైద్య ఖర్చులయ్యాయి. ఇవి మెడికల్ రీయింబర్స్‌మెంట్ కింద తెచ్చుకునేందుకు దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి ఇంకా వరంగల్ కలెక్టరేట్‌లోనే పెండింగ్‌లో ఉండడంతో ఆందోళన చెందుతున్నారు.’
సాక్షి, వరంగల్:
...వీరే కాదు ఇలా జిల్లాలో సుమారు 45కుపైగా రెవెన్యూ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన మెడికల్ రీయింబర్స్‌మెంట్ దరఖాస్తులు కలెక్టరేట్‌లో పెండింగ్‌లో ఉండడం వారికి ఆందోళన కలిగిస్తోంది. ఈ ఫైళ్లు రూ.50వేల లోపు ఉంటే జిల్లా మెడికల్ బోర్డు, ఆపై రూ.మూడు లక్షల లోపు ఉంటే సంబంధిత విభాగ ఉన్నతాధికారి నుంచి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు కలెక్టర్ ద్వారా వెళ్లాల్సి ఉండగా దాదాపు ఏడాదిగా జిల్లా కలెక్టరేట్‌లోనే మూలుగుతుండడంతో వారి వెతలు వర్ణనాతీతంగా మారాయి. చాలా మంది ఉద్యోగులు కలెక్టరేట్‌కు వచ్చి సంబంధిత అధికారులను కలిసి అడుగుతున్నా, రేపు మాపు అంటూ, కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉందంటూ తిప్పి పంపిస్తుండడంతో బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే ఈ పెండింగ్ ఫైళ్లు కలెక్టరేట్‌లో ఎక్కడ ఉన్నాయో తెప్పించుకొని కలెక్టర్ డాక్టర్ సత్యశారద క్లియర్ చేయాలని అభ్యర్థిస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా వీటిని క్లియర్ చేస్తే ఆర్థికంగా తమ కుటుంబాలను అదుకున్నవారవుతారని వేడుకుంటున్నారు.
2023 మార్చి నుంచి 2025 జూన్ 20 వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను కొద్ది నెలల క్రితం ప్రభుత్వం క్లియర్ చేసేందుకు నిధులిచ్చినా జిల్లాలో మాత్రం విచిత్ర పరిస్థితి ఉందని వాపోతున్నారు. దేవుడి కరుణించినా, పూజారి వరమివ్వలేదన్నట్టుగా తమ పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కలెక్టరేట్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ను ఫోన్‌లో సంప్రదిస్తే కలెక్టరేట్‌లో ఏమీ పెండింగ్‌లో లేవని, అంతా క్లియర్ అయ్యాయని చెబుతుండడం గమనార్హం. ఇదిలాఉండగా ఈ పెండింగ్ ఫైళ్లు క్లియర్ చేయకపోతే కలెక్టరేట్ కార్యాలయంలోనే ఆందోళన చేస్తామని కలెక్టరేట్‌లోని సిబ్బందిని శనివారం కలిసి వచ్చిన ఓ రిటైర్డ్ ఉద్యోగి అన్నారు. ఈ 45 మెడికల్ రీయింబర్స్‌మెంట్ ఫైళ్లు కలిపి సుమారు రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉండొచ్చన్నారు.
కలెక్టరేట్‌లో మెడికల్ రీయింబర్స్‌మెంట్ దరఖాస్తులు
కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఉద్యోగులు, పెన్షనర్లు
రేపు, మాపు అంటూ సిబ్బంది దాటవేస్తుండడంతో ఆందోళన
పెండింగ్ ఫైళ్లు లేవంటున్న అధికారులు