
ఎస్సారెస్పీ భూమి కబ్జా
హసన్‌పర్తి: సుమారు కోటిన్నర రూపాయల విలువైన ఎస్సారెస్పీ భూమి కబ్జాకు గురైంది. ఓ రియల్టర్ సుమారు పది గుంటల భూమిని ఆక్రమించుకున్నాడు. ప్రస్తుతం ఇక్కడ ఒక గుంట భూమి విలువ సుమారు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలు పలుకుతోంది. గండ్లసింగారం నుంచి పెగడపల్లి, సీతానాగారంతో పాటు కింద రైతులకు సాగు నీరందించడానికి భూములు సేకరించారు. గుండ్లసింగారం ప్రధాన కాల్వ నుంచి ెపెగడపల్లి వైపునకు సాగునీరందించడం కోసం కాల్వ(డీబీఎం–26) నిర్మించారు. కాల్వకు ఇరువైపులా సుమారు మధ్యలో నుంచి 40 ఫీట్ల నుంచి 50 ఫీట్ల వరకు స్థలాన్ని ఇన్‌స్పెక్షన్ పాత్ కోసం వదిలిపెట్టారు. మరి కొంత భూమి కూడా పడవుగానే ఉంది.
రియల్టర్ కన్ను
గుండ్లసింగారం–ముచ్చర్ల మధ్య ప్రధాన రహదారికి ఆనుకుని పడావుగా ఉన్న కాల్వ భూమిపై ఓ రియల్టర్ కన్ను పడింది. ఇటీవల ఆ భూమిని చదును చేశాడు. అప్పటికే భూమి ఆక్రమణకు గురవుతోందని నీటి పారుదలశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం భూమి చుట్టూ కంచె ఏర్పాటు చేశాడు. అధికారుల కన్నసన్నల్లోనే ఈవ్యవహారం సాగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
కబ్జాపై పూర్తిస్థాయి విచారణ జరుపుతాం. ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకుంటాం. కబ్జాదారుడిపై చర్యలు తీసుకుంటాం.
– కిశోర్, ఏఈ
రూ.కోటిన్నర విలువైన స్థలానికి ఎసరు?
అంతా అధికారుల కన్నుసన్నల్లోనే!