
నగరాన్ని వణికించిన వాన
సాక్షి, వరంగల్/హన్మకొండ/వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ నగరంలో ఆదివారం ఉదయం కురిసిన మోస్తరు వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలో రెండు గంటలపాటు దంచికొట్టిన వానతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హనుమకొండలోని ఎన్జీఓస్ కాలనీ రోడ్డులోని భవానీనగర్, వికాస్‌నగర్ కూడలి, అంబేడ్కర్ భవన్ వద్ద వరదనీరు రోడ్డుపైకి చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్ ఆవరణలో వరద నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. హనుమకొండ చౌరస్తా, పెట్రోల్ పంపు ప్రాంతాల, గోకుల్‌నగర్ కాలనీవాసులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
రాకపోకలకు అంతరాయం..
ఖిలావరంగల్ రాతికోట చుట్టూ ఉన్న మాల అగర్త చెరువు అలుగు పోయడంతో మైసయ్యనగర్, అక్కడి నుంచి శివనగర్ రహదారుల మీదుగా అండర్ బ్రిడ్జి వరకు వరద చేరింది. గంట పాటు వాహనాల రాకపోకలు నిలిచాయి. ఆర్టీసీ బస్సుల్లోకి నీరు రావడంతో మధ్యలోనే ఆగిపోయాయి. ప్రయాణికులు 8 ఫీట్ల టేబుల్‌పై నుంచి నడిచి అండర్ బ్రిడ్జి గద్దె దాటారు. ఇంతేజార్‌గంజ్ సీఐ షుకూర్, పోలీసు సిబ్బంది నడుములోతులో ఉన్న నీటి నుంచి ఓ తాడు సాయంతో ప్రయాణికులను రోడ్డుకు చేర్చారు. మట్టికోట చుట్టూ ఉన్న అగర్తల చెరువులు పూడ్చివేసి అక్ర మ నిర్మాణాలు చేపట్టడంతోనే ఇక్కడి కాలనీలు చిన్నపాటి వర్షానికే జలమయమవుతున్నాయి.
అశోకా కాలనీలో కూలిన వృక్షం..
వర్షానికి హనుమకొండలోని అశోకా కాలనీలో వృక్షం కూలిపోయి విద్యుత్ లైన్ తెగిపోయింది. రెండు విద్యుత్ స్తంభాలు విరిగాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. డీఆర్‌ఎస్ సిబ్బంది చేరుకుని వృక్షాన్ని తొలగించారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది చేరుకుని యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి విద్యుత్ లైన్‌ను పునరుద్ధరించారు. వరంగల్ జిల్లా పైడిపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో అత్యధికంగా 70.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రోడ్లపైకి నీరు రావడంతో ప్రజలకు ఇబ్బందులు
అండర్ బ్రిడ్జి వద్ద
వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులు
పోలీసుల సమయస్ఫూర్తితో
ప్రయాణికులు సురక్షితం

నగరాన్ని వణికించిన వాన

నగరాన్ని వణికించిన వాన

నగరాన్ని వణికించిన వాన