హన్మకొండ: విద్యుత్ సర్వీస్‌ల మంజూరు సజావుగా, పారదర్శకంగా సాగుతోందని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల పరిధిలోని నూతనంగా విద్యుత్ సర్వీస్‌లు పొందిన గృహ, గృహేతర, వ్యవసాయ, పరిశ్రమల వినియోగదారులతో ఫోన్ ద్వారా ముఖాముఖి మాట్లాడారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం నూతన సర్వీస్‌ల మంజూరు జరుగుతున్నదా.. లేదా..? పారదర్శకంగా, నిష్పాక్షికంగా మంజూరు అవుతున్నదా.. లేదా..? అవినీతి రహితంగా సమయానుకూలంగా సర్వీస్‌ల మంజూరు జరుగుతున్నదా.. లేదా.. అని వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సర్వీస్‌ల మంజూరులో ఎలాంటి ఇబ్బందులు లేవని, సమయానికి సర్వీస్ విడుదల చేస్తున్నారని వినియోగదారులు తెలిపారు. నేరుగా మాట్లాడడం తమకు సంతోషంగా ఉందని తెలిపారు. సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ తాను ఇలా తరుచూ వినియోగదారులతో మాట్లాడుతానన్నారు. వినియోగదారులతో మాట్లాడడం వల్ల క్షేత్ర స్థాయిలో సమస్యలు నేరుగా తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. వినియోగదారులతో మమేకమై వారికి మరింత మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ
కర్నాటి వరుణ్ రెడ్డి