
భూకబ్జాలు, రౌడీషీటర్లపై సమాచారం సేకరించండి
హన్మకొండ చౌరస్తా: రౌడీషీటర్ల కదలికలపై ఆరా తీసి, భూకబ్జాలకు పాల్పడే వారి సమాచారాన్ని సేకరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ స్పెషల్ బ్రాంచ్ పోలీస్ అధికారులకు సూచించారు. వరంగల్ కమిషనరేట్ ఎస్‌బీ విభాగానికి చెందిన అధికారులు, సిబ్బందితో కమిషనరేట్‌లో గురువారం సీపీ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ముందుగా.. పోలీస్ అధికారులు నిర్వహిస్తున్న విధులు, తీరు తెన్నులపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీపీ సన్‌ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ.. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ముందస్తు సమాచారాన్ని సేకరించడం ఎస్‌బీ సిబ్బంది ప్రధాన కర్తవ్యమన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే స్పెషల్ బ్రాంచ్ అధికారులు కచ్చితమైన సమాచారాన్ని, కచ్చితమైన సమయానికి అందించాలని, ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ భవిష్యత్‌లో జరిగే ఘటనలపై పటిష్ట నిఘా ఉంచాలన్నారు. పాస్‌పోర్ట్ విచారణ త్వరగా పూర్తి చేయాలన్నారు. నిజాయితీగా పని చేయాలని విధుల్లో ప్రతిభ కనబర్చిన వారికి రివార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. వరంగల్ కీర్తి ప్రతిష్టలు స్పెషల్ బ్రాంచ్‌పైనే ఆధారపడి ఉన్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్‌బీ ఏసీపీలు జితేందర్‌రెడ్డి, పార్థసారథి, రాజు, గురుస్వామి, శేఖర్, సంజీవ్, చంద్రమోహన్, డీఏఓ ఇషాక్, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో సమీక్ష