వరంగల్ అర్బన్ : బల్దియా పన్నుల విభాగం అధికారులు, సిబ్బంది ఆస్తిపన్ను వసూళ్లపై దూకుడు పెంచారు. పన్ను చెల్లించని బకాయిదారులకు డిమాండ్, రెడ్ నోటీసులు జారీ చేస్తున్నారు. అయినా స్పందించకపోవడంతో ఆస్తులను సీజ్ చేసి జప్తు చేస్తున్నారు. మూడేళ్లుగా రూ.44 లక్షల ఆస్తి పన్ను బకాయి ఉన్న హనుమకొండలోని జయ నర్సింగ్ కళాశాలను మంగళవారం సీజ్ చేశారు. ఇలా వారం రోజుల్లో 356 ఆస్తులను సీజ్ చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.118.06కోట్లకు గాను రూ.61.39కోట్లు మాత్రమే వసూలు చేశారు. మరో 13 రోజుల్లో గడువు ముగియనుంది.
మెమోల జారీతో..
బల్దియాకు ఆస్తి పన్ను ప్రధాన వనరు. పన్నుల వసూలులో మొదటినుంచి నిర్లక్ష్యంగా ఉంటూ మార్చిలో హడావుడి చేస్తుండడంతో మేయర్, కమిషనర్ ఇటీవల సమావేశాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తాజాగా డిప్యూటీ కమిషనర్లకు, టీఓకు, ఆర్‌ఓ,ఆర్‌ఐ, వార్డు ఆఫీసర్లకు మెమోలు జారీ చేశారు. రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతధికారులు వందశాతం పన్నుల వసూలు చేయకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరికలు చేశారు.
అద్దె వ్యాపార సంస్థలకు తాళాలే..
అద్దె భవనంలో వ్యాపారం చేస్తున్నా.. ఆస్తిపన్ను చెల్లించాల్సిన బాధ్యత భవన యజమానిదే. ఇకపై అలా కుదరదని తాముంటున్న భవనానికి సంబంధించి ఆస్తిపన్ను చెల్లింపు బాధ్యతను అద్దెదారులు పట్టించుకోవాలంటున్నారు బల్దియా అధికారులు. లేని పక్షంలో చట్టప్రకారం తీసుకునే చర్యలతో నష్టపోవాల్సి వస్తుందని, తాజాగా సుబేదారిలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్‌ను సీజ్ చేశారు. దీంతో చేసేదేమి లేక సదరు యజమాని ఆస్తి పన్ను చెల్లించాల్సి వచ్చింది. ప్రతినెలా ఆస్తిపన్నుపై 2శాతం వడ్డీ, అంటే ఏడాదికి 24శాతం అవుతోంది. ఇలా ఏళ్ల తరబడి చెల్లించని పన్ను బకాయిదారులకు ఆస్తిపన్ను భారంగా మారుతోంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు చేరడంతో ఎంత మేరకు లక్ష్యాన్ని సాధిస్తారో చూడాలి.
గ్రేటర్ పరిధిలో వారంలో 356 ఆస్తులు సీజ్
రూ.44లక్షలు చెల్లించని
జయ నర్సింగ్ కాలేజీకి తాళం
పన్ను బకాయిదారులపై
అధికారుల కొరడా