కాళేశ్వరంపై నేడు క్రాస్‌ ఎగ్జామినేషన్‌! | - | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంపై నేడు క్రాస్‌ ఎగ్జామినేషన్‌!

Oct 23 2024 1:04 AM | Updated on Oct 23 2024 2:39 PM

‘కాగ్‌’ నివేదికలు ప్రామాణికం

ఇరిగేషన్‌ అధికారులకు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ సమాచారం

2024 ‘కాగ్‌’ నివేదికలోని అంశాలపైన ఆరా తీయనున్న కమిషన్‌

ఈనెల 29వరకు సాగనున్న విచారణ

రిటైర్డ్‌ ఇంజనీర్లు, విధుల్లో ఉన్న ఉన్నతాధికారుల్లో కలకలం

ప్రాజెక్టుపై ‘కాగ్‌– 2022’ అభ్యంతరాలు

ప్రాజెక్టు లింకు–1 కింద 2016 జూలై నుంచి 2021 డిసెంబర్‌ మధ్య మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద 80 వేల క్యూసెక్కులు, 65 వేల క్యూసెక్కులు, 57 వేల క్యూసెక్కుల గరిష్ట వరద విడుదలను పరిగణలోకి తీసుకుని మూడు బ్యారేజీలు నిర్మించగా.. గేట్లను మూసివేసిన తరువాత, ఆర్‌సీసీ వేసిన కోటు, సీసీ కర్టెన్‌ గోడలలో కొంత భాగం, దిగువ భాగంలో నిర్మించిన సిమెంట్‌ కాంక్రిట్‌ బ్లాక్‌లు కొట్టుకుపోయి రూ.180.39 కోట్లు నష్టం వాటిల్లింది.

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ బుధవారం నుంచి మళ్లీ విచారణ చేపట్ట నుంది. ఈ మేరకు ఆయా ప్రాజెకుల పరిధిలోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు, పంపుహౌస్‌ల నిర్మాణంలో విధులు నిర్వర్తించిన అధికా రులకు కమిషన్‌ సమాచారం అందించింది. గత ఏడాది అక్టోబర్‌ నుంచి ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్న విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) నివేదికలను మరోసారి చర్చించనున్నట్లు పేర్కొంది. ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, వ్యయం, లోపాలపై ఈ ఏడాది ఫిబ్రవరిలో కంప్ట్రోలర్‌ అడిట్‌ జనరల్‌(కాగ్‌) విడుదల చేసిన నివేదికలను ప్రామాణికంగా తీసుకోనుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు శంకుస్థాపన మొదలు.. ప్రారంభం వరకు కీలకంగా వ్యవహరించిన నల్లా వెంకటేశ్వర్లు(రిటైర్డు ఈఎన్‌సీ)తో పాటు ఆయన కనుసన్నల్లో.. ఆదేశాలు, సూచనల మేరకు పనిచేసిన చీఫ్‌, సూపరింటెండెంట్‌, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లతో పాటు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్ల ను ఈసారి విచారించే అవకాశం ఉంది. ఆ అధికారులు ఇప్పుడు విధుల్లో ఉన్నా.. పదవీ విరమణ పొందినా అవసరమైతే వారిని విచారించేందుకు అందుబాటులో ఉండాలని ముందస్తు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. జయశంకర్‌ భూపాలపల్లి, కరీంనగర్‌, హనుమకొండ, హైదరాబాద్‌ ప్రాంతాల్లో నివాసం ఉండే పలువురికి కూడా సమాచారం అందినట్లు పేర్కొంటున్నారు. కొందరు ఇంజనీర్లు, రిటైర్డ్‌ ఇంజనీర్లు, ఉన్నతాధికారులకు రేపటి నుంచి మళ్లీ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ జరగనుంది. 29వ తేదీ వరకు సాగే ఈ క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో ఎవరెవరికీ ఎప్పుడు సమాచారం వస్తుందో? అనే టెన్షన్‌లో ఉన్నారు.

● విడుదలైన నీటి అధిక వేగం, శక్తిని తట్టుకునే విధంగా ఏర్పాటు చేయకపోవడమే ఈ నష్టాని కి కారణమని సాగునీటి శాఖ చేసిన అధ్యయనాలు వెల్లడించడం.. మూడు బ్యారేజీలలోని నష్టాలను సరిదిద్దడానికి అంచనా వేసిన మొత్తం రూ.476.03 కోట్లకు సవరించిన అంచనాలను ‘కాగ్‌’ బహిరంగపర్చింది. సిమెంట్‌, కాంక్రీట్‌ దిమ్మెల ఆఫ్రాన్‌ లాంచింగ్‌ రూపకల్ప న లోపభూయిష్టంగా ఉండటంతో ఈ పనులు ఉద్గార వేగాన్ని తట్టుకోలేక కొట్టుకుపోయి రూ.180.39 కోట్ల నష్టం వాటిల్లినట్లు తేల్చింది.

● కాళేశ్వరం ప్రాజెక్టు లింకు–1 కింద చేపట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, ఎత్తిపోతలకు వ్యయం విపరీతంగా పెంచి.. రూ.10,783.30 కోట్లతో అప్పగించిన పనుల విలువ రూ.21,297.11 కోట్లకు చేర్చార ని ‘కాగ్‌’ పేర్కొంది. సవరించిన అంచనాలు, అనుబంధ ఒప్పందాలు, వర్క్‌స్లిప్‌ల ప్రకారం మేడిగడ్డ అంచనాలు 74 శాతం, అన్నారం బ్యారేజీ 77 శాతం, అన్నారం ఎత్తిపోతల వ్యయం రూ.1,669.23 కోట్ల నుంచి రూ.3,772.56 కోట్ల(126 శాతం)కు పెరిగింద ని నివేదిక వెల్లడించింది. అలాగే సుందిళ్ల ఎత్తిపోతల ఖర్చు 106 శాతం పెరిగింది.

● మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ, పంపుహౌస్‌ల నిర్మాణ పనుల వ్యయం పెరిగినప్పటికీ 2018 ఫిబ్రవరి నుంచి ఆగస్టు మధ్యలో పూర్తి కావాల్సిన ఈ పనులు ఒక్కోటి 15 నెలల నుంచి 41 నెలల ఆలస్యంగా పూర్తయినట్లు ఆధారాలతో పేర్కొంది. ఈ బ్యారేజీల కోసం నిర్దేశించిన భూసేకరణ ఇంకా పూర్తి కాలేదని, 7,153.77 ఎకరాలకు గాను 5,240.78 ఎకరా లు సేకరించగా, భూముల ధరలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇంకా 1,912.99 ఎకరాలు.. ఎప్పుడు, ఎలా సేకరిస్తారని ప్రశ్నించింది.

...వీటన్నింటితో పాటు ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నివేదికల్లో తేలిన లోపాలు, అంశాలపై సమగ్ర విచారణకు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎదుట హాజరు కావడానికి సంబంధిత ఇంజనీర్లు, ఉన్నతాఽధికారులు సిద్ధం కాగా.. ఈసారి విచారణలో ఏం తేలనుందో అనే ఉత్కంఠ ఆయా వర్గాల్లో కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement