35 శాతం రాయితీతో పప్పుశనగలు | - | Sakshi
Sakshi News home page

35 శాతం రాయితీతో పప్పుశనగలు

Oct 8 2026 3:30 AM | Updated on Oct 8 2026 3:30 AM

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు 41,624 క్వింటాళ్లు విత్తన పప్పుశనగకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం ఏపీ సీడ్స్‌ జిల్లా మేనేజర్‌ సుమలత

కొరిటెపాడు(గుంటూరు): నల్లరేగడి భూముల్లో రబీ పంటగా పప్పుశనగ సాగు చేసే రైతులకు 35 శాతం రాయితీతో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు 41,624 క్వింటాళ్ల జేజీ–11, కేఏకే–2 రకం ట్రూత్‌ఫుల్‌ లేబుల్‌(టీఎల్‌) విత్తనాలు పంపిణీ చేయడానికి సిద్ధం చేసినట్లు ఏపీ సీడ్స్‌ జిల్లా మేనేజర్‌ పి.సుమలత బుధవారం తెలిపారు. ప్రాసెసింగ్‌ ప్లాంట్లలో విత్తనశుద్ధి చురుగ్గా కొనసాగుతుండగా.. ఇప్పటికే సుమారు 2 వేల క్వింటాళ్లు పల్నాడు జిల్లాలోని పలు మండలాల రైతు సేవా కేంద్రాల(ఆర్‌ఎస్‌కే)కు పంపించినట్లు చెప్పారు. వ్యవసాయ శాఖ, ఏపీ సీడ్స్‌ ఆధ్వర్యంలో ఒకవైపు రిజిస్ట్రేషన్లు, మరోవైపు పంపిణీ ప్రక్రియ చేపడతామని తెలిపారు. ఇప్పటికే పప్పుశనగ సాగు చేసుకునే రైతులకు ఆర్‌ఎస్‌కేల్లో రాయితీ విత్తనానికి రిజిస్ట్రేషన్లు మొదలు పెట్టడం జరిగిందన్నారు. రిజిస్ట్రేషన్‌తో పాటు విత్తనం నిల్వ చేసిన ప్రాంతాల్లో వెనువెంటనే పంపిణీ కూడా చేస్తున్నామని వెల్లడించారు. పల్నాడు జిల్లాకు 27,180 క్వింటాళ్లు, గుంటూరు జిల్లాకు 9,320 క్వింటాళ్లు, బాపట్ల జిల్లాకు 5,124 క్వింటాళ్లు మొత్తంగా 41,624 క్వింటాళ్లు కేటాయించడం జరిగిందన్నారు. పల్నాడు జిల్లాకు కేటాయించిన 27,180 క్వింటాళ్లలో ఇప్పటికే 2 వేల క్వింటాళ్లు గురజాల, దుర్గి మండలాల్లోని ఆర్‌ఎస్‌కేలకు సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. క్వింటా పూర్తి ధర రూ.9 వేలు కాగా అందులో 35 శాతం రాయితీ రూ.3,150 పోనూ రైతులు తమ వాటా కింద రూ.5,850 రైతులు చెల్లించాలన్నారు. భూమి విస్తీర్ణం బట్టి ఒక్కో రైతుకు ఒక్కో ఎకరానికి 40 కిలోలు చొప్పున గరిష్టంగా ఐదు ఎకరాలకు 200 కిలోల విత్తనాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఒక్కో బస్తా 20 కిలోలు ఉంటుందని పేర్కొన్నారు. విత్తన పప్పుశనగ కావాల్సిన రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌ కార్డులతో సంబంధిత ఆర్‌ఎస్‌కేకు వెళ్లి రిజిస్ట్రేషన్లు చేసుకుకోవాలని ఆమె సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement