బాపట్లటౌన్: దళిత క్రై స్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ జూలై 4న బాపట్లలో దళిత క్రై స్తవుల భారీ నిరసన ప్రదర్శనకి జిల్లా నలుమూలల నుంచి దళిత క్రైస్తవులు తరలి రావాలని దళిత క్రైస్తవ ఐక్య వేదిక కన్వీనర్ దేవతోటి సుందరయ్య పిలుపునిచ్చారు. పట్టణంలోని అంబేడ్కర్ భవన్‌లో శనివారం సాయంత్రం నిరసన కార్యక్రమం వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. సుందరయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారం తమకు నచ్చిన మతం స్వీకరించి, ఆచరించి, ప్రచారం చేసుకునే హక్కుని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కల్పించారని, క్రైస్తవ మతం స్వీకరించిన దళితులకు ఎస్సీ హోదా నిరాకరిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడం, దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం శోచనీయమన్నారు. సుప్రీంకోర్టు తీర్పును పునర్విచారణ చేయాలని, రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించి దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తింప చేయాలన్నారు. కార్యక్రమంలో సమాజ సేవకులు మోపర్తి జాన్, అంబేడ్కర్ సేవా సమాజం గౌరవాధ్యక్షుడు మందపాటి పరమానందకుమార్, మండే విజయకుమార్, గుదే రాజారావు, కురగంటి శ్యామ్ రాజు, పాస్టర్లు మేజర్ చల్లాపల్లి ఏలియ రాజు, మేజర్ దాసరి మైఖేల్ పాల్గొన్నారు.
కారంచేడు: మండలంలోని పోతినవారిపాలెం గ్రామానికి చెందిన పోతిన వెంకట్రావుకు డాక్టరేట్ విత్ ఇంటర్నేషనల్ ఛేంజ్ మేకర్ అవార్డు వరించింది. ఆయన 1990 నుంచి గ్రామంలో తన వ్యవసాయ భూమిలో అనేక రకాల వంగడాలను సాగు చేసి ఉత్తమ రైతుగా అవార్డులు తీసుకున్నారు. అంతర పంటలతో పాటు, శనగ, పత్తి, పొగాకు, మొక్కజొన్న, పెసర, మినుము వంటి పంటలను సాగు చేసి అధిక దిగుబడులు సాధించారు. తాజాగా శనివారం ఢిల్లీలో సోక్రేట్స్ సోషల్ రీసెర్చ్ యూనివర్సిటీ ట్రస్ట్ వారు వెంక్రట్రావుకు డాక్టరేట్‌తో పాటు ఇంటర్నేషనల్ ఛేంజ్ మేకర్ అవార్డును అందించారు. 2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఉత్తమ ఆదర్శ రైతు అవార్డు, 2010లో ప్రకాశం జిల్లా ఉత్తమ రైతు, 2011లో పర్చూరు డివిజన్ ఉత్తమ రైతు, 2018లో గుంటూరు లాంఫాం కాలేజీ నుంచి ఉత్తమ రైతు అవార్డు, 2021లో జాతీయ ఆదర్శరైతు, 2024లో సేవానంది జాతీయ పురస్కారాలు అందుకున్నారు. వెంకట్రావును రైతులు, గ్రామస్తులు అభినందించారు.


