నిబంధనలకు వ్యతిరేకంగా కోల్డ్ స్టోరేజ్ మిర్చియార్డులో స్థలం కేటాయింపు టెండర్లు కూడా లేకుండానే 70 సెంట్ల స్థలం కేటాయింపు లబ్ధిదారుడు లోకేష్ ముఖ్య అనుచరుడు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: మనోడైతే చాలు ఎటువంటి నిబంధనలు, టెండర్లు వంటి ఏ ప్రక్రియ అవసరం లేదు. ఒక జీఓ ఇచ్చేయడమే... ప్రభుత్వ స్థలాన్ని ధారాదత్తం చేసేస్తారు. పైగా దరఖాస్తు చేసుకున్న వ్యక్తి చినబాబుకి దగ్గరైతే ఇంక అడ్డేముంది. మంగళగిరికి చెందిన తెలుగుదేశం నాయకుడు పోతినేని శ్రీనివాసరావుతో పాటు పోతినేని సుబ్బారావుకు గుంటూరు మిర్చియార్డులో అడ్మినిస్ట్రేషన్ భవనం ముందు కోల్డ్ స్టోరేజీ నిర్మాణం కోసం 70 సెంట్ల స్థలాన్ని 30 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ ఇటీవల జీఓ జారీ అయ్యింది. మంగళగిరి తెలుగుదేశం నాయకుడిగా ఉన్న పోతినేని శ్రీనివాసరావు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్‌కు అన్ని తానై వ్యవహరించారు. ఇప్పటికి కూడా మంగళగిరిలో అన్ని వ్యవహారాలను ఆయనే చక్కదిద్దుతుంటారు. దీంతో దానికి రుణం తీర్చుకోవడం కోసమే రూ. 20 కోట్లకు పైగా విలువ చేసే భూమిని ఎటువంటి టెండర్లు లేకుండా పోతినేని శ్రీనివాసరావుకు కట్టబెట్టేశారు.
రైతులకు ప్రయోజనం శూన్యం
మిర్చియార్డులో ఇప్పటికే ఒక కోల్డ్‌స్టోరేజీ ఉంది. గతంలో దీన్ని కూడా 30 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. దీనివల్ల మిర్చియార్డుకు వస్తున్న ఆదాయం నామమాత్రమే. అయితే రైతులకు దీనివల్ల పెద్దగా ప్రయోజనం లేదు. ఇప్పుడు దీనికి కూడా లీజు పొడిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రూ.వేల కోట్ల వ్యాపారం జరిగే మిర్చియార్డులో ప్రభుత్వం తరఫున కోల్డ్ స్టోరేజీ నిర్మాణం చేస్తే ప్రభుత్వానికి ఆదాయంతోపాటు రైతులకు కూడా తక్కువ ధరకు తమ మిర్చిని నిల్వ చేసుకునే అవకాశం లభిస్తుంది. దీనికి భిన్నంగా ప్రైవేటు వారికి, ముఖ్యంగా తమ అనుచరులకు కట్టబెట్టుకుంటూ పోతే దీని వల్ల రైతులకు ఏ మాత్రం ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 30 ఏళ్లపాటు లీజుకు ఇచ్చిన తర్వాత ఆ భూమిని మళ్లీ వెనక్కి తీసుకోవడం జరిగే పనికాదు.
ఆగమేఘాలపై జీఓ..
2018లో ప్రభుత్వం తరపున కోల్డ్‌స్టోరేజీ నిర్మాణం కోసం పనులు చేపట్టారు. అయితే అవి పిల్లర్ల వరకూ వచ్చి వివిధ కారణాలతో నిర్మాణం నిలిచిపోయింది. ప్రస్తుతం అదే స్థానంలో కొత్తగా కోల్డ్ స్టోరేజీ నిర్మాణం కోసం ప్రైవేటువారికి కట్టబెట్టారు. కొత్తగా కోల్డ్‌స్టోరేజీ కేటాయించాలంటే కనీసం టెండర్లు పిలవడం కాని, పాలకవర్గం ఆమోదించడం గాని జరగాల్సి ఉంటుంది. దీనికి భిన్నంగా ఏకంగా ప్రభుత్వం నుంచి ఫలానా వారికి మిర్చియార్డులో 70 సెంట్ల స్థలం కేటాయిస్తున్నట్లు జీఓ ఇచ్చేయడం గమనార్హం. 1995లోని మార్కెటింగ్ శాఖ జీవో 448, 1999లోని జీఓ 280 ప్రకారం నియమనిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. కనీసం ఫలానావారు దరఖాస్తు చేసుకున్నారు. వారికి కేటాయించాలని కోరుతూ తీర్మానాలు కూడా ఏమీ లేకుండానే కేవలం లోకేష్ ముఖ్యఅనుచరుడు కావడంతో కేటాయించడాన్ని వ్యాపారులు తప్పు పడుతున్నారు.


