పెదకాకాని: మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆదివారం మూసివేస్తున్నట్లు ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్, పాలకవర్గం చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. శివాలయం ఎదురుగా రోడ్డులో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి మృతి చెందడంతో శైవాగమ పద్ధతి ప్రకారం ఆలయ స్థానాచార్యులు, ప్రధాన అర్చకస్వాముల సూచన మేరకు శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకూ ఆలయ తలుపులు మూసివేస్తున్నట్లు తెలిపారు. ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తామని వారు తెలిపారు. ఆదివారం సాయంత్రం 4.30 నుంచి రాహుకేతుల పూజలు యథావిధిగా జరుగుతాయన్నారు.
నేటి నుంచి మహిళా అభ్యర్థులకు పరీక్షలు
పెదకాకాని: ఏపీ పీసెట్–2026లో భాగంగా పురుష అభ్యర్థులకు నిర్వహిస్తున్న పరీక్షలు శనివారంతో ముగిశాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆరు రోజులుగా పరీక్షలు నిర్వహిస్తున్న విషయం విదితమే. నాల్గవ రోజు శనివారం 714 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 557 మంది హాజరయ్యారు. ఆదివారం నుంచి మహిళా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. హాల్‌టికెట్ నెంబరు 30001 నుంచి 30680 వరకూ మొత్తం 680 మంది మహిళా అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తామని కన్వీనర్ డాక్టర్ పీపీఎస్ పాల్‌కుమార్ తెలిపారు.
గుంటూరు వెస్ట్(క్రీడలు): జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యాన త్రీమెన్ కమిటీ సారధ్యంలో నెల రోజుల నుంచి స్థానిక అరండల్‌పేటలోని మాజేటి గురవయ్య హైస్కూల్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న ఉచిత క్రికెట్ కోచింగ్ క్యాంప్ ముగిసింది. త్రీమెన్ కమిటీ సభ్యుడు శివరామకృష్ణ మాట్లాడుతూ సుమారు 400 మంది చిన్నారులు ఈ క్యాంప్‌లో పాల్గొన్నారన్నారు. అనుభవజ్జులైన కోచ్‌ల పర్యవేక్షణలో చిన్నారులు ఎంతో నేర్చుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో తుంగభద్ర వారియర్స్ టీంకు కో ఓనర్ ఓ.సాయికృష్ణ తేజ, హిందూ కళాశాల విద్యా సంస్థల సెక్రటరీ రామకృష్ణమూర్తి, త్రీమెన్ కమిటీ సభ్యులు నాగరాజు, శరత్‌బాబు, రామకృష్ణ పరమహంస, చిన్నారులు పాల్గొన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న 111 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. జెడ్పీ డిప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ, అకౌంట్స్ అధికారి పి.శామ్యూల్ పర్యవేక్షణలో నిర్వహించిన ధ్రువపత్రాల పరిశీలనకు 95 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో జెడ్పీ పరిపాలనాధికారి ఎన్. నిర్మల భారతి, సీహెచ్ శ్రీనివాసరావు, జె.శోభారాణి, రాజారత్నబాబు, సిబ్బంది పాల్గొన్నారు.
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 519.20 అడుగులకు చేరింది. సాగర్ జలాశయం నుంచి కుడికాలువకు 7,033, ఎస్‌ఎల్‌బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 7,483 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్ జలాశయానికి 7,483 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.


