జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ
గుంటూరు వెస్ట్: బాలింతల ఆరోగ్య సంరక్షణ బాధ్యతలను వైద్య ఆరోగ్య శాఖ, ఐసీడీఎస్ శాఖలు సంయుక్త బాధ్యత తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ సూచించారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లో మిషన్ వాత్సల్య పథకం ద్వారా అమలవుతున్న చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ కమిటీ జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ బాలింతలకు అవసరమైన వైద్యాన్ని ప్రతినెలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. సరైన పోషకాహారాన్ని అందించటం, వారికి ఆరోగ్యంపై సంపూర్ణ అవగాహన కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. హైరిస్క్ ఉన్న సందర్భాలలో జాప్య నివారణకు వారి కుటుంబ సభ్యులకు అవగాహన కలిగించాలన్నారు. గృహ హింస జరిగిన కేసుల్లోని బాధితులకు వన్ స్టాప్ సెంటర్ ద్వారా సేవలు అందించాలన్నారు. సమాజంలో జరుగుతున్న సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ముఖ్యంగా బడి ఈడు పిల్లలు ప్రవర్తన గురించి ఉపాధ్యాయులు గమనించాలన్నారు. సంక్షేమ హాస్టల్స్‌లో ఉండే విద్యార్థినీ విద్యార్థులు ప్రవర్తన గురించి పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. వరకట్న నిషేధం గురించి కాలేజీ స్థాయిలోనే సంపూర్ణ అవగాహన కలిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మి, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రసూన, డీసీపీఓ విజయ్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


