గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల జీజీహెచ్‌లో 150 కాంట్రాక్టు స్టాఫ్‌నర్సు ఉద్యోగాలకు విడుదల చేసిన ఫైనల్ మెరిట్ లిస్టును సవరించి తిరిగి విడుదల చేస్తామని గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) డాక్టర్ జి.శోభారాణి తెలిపారు. పిడుగురాళ్ల జీజీహెచ్‌లో కాంట్రాక్టు స్టాఫ్‌నర్సు ఉద్యోగాలకు నకిలీ అర్హత ధ్రువపత్రాలు పెట్టి ఉద్యోగాలు పొందేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని ఈనెల 3వ తేదీన ‘నర్సింగ్ ఉద్యోగాల్లో నకి‘లీల’లు’ అనే శీర్షికన, ఈనెల 5న ‘చదివింది ఒకటి– సర్టిఫికెట్ మరొకటి’ శీర్షికన ‘సాక్షి’లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో పలువురు అభ్యర్థులు గుంటూరు ఆర్డీ కార్యాలయం వద్దకు వెళ్లి తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఫైనల్ మెరిట్ లిస్టు అభ్యంతరాలు తెలిపేందుకు ఆర్డీ అధికారులు ఒక్కరోజు మాత్రమే గడువు ఇచ్చారు. ఫైనల్ మెరిట్ లిస్టులో పలు తప్పిదాలు సాక్షి వెలుగులోకి తీసుకు రావడంతో వాటిని సరిచేసి తిరిగి జాబితా ప్రచురిస్తామని ఆర్డీ డాక్టర్ శోభారాణి శనివారం వెల్లడించారు. స్టాఫ్‌నర్సు ఉద్యోగానికి జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ చదివిన ఇద్దరూ అర్హులేనని పేర్కొన్నారు. ఎంఎల్‌హెచ్‌సీ, సీహెచ్‌ఓ, యూపీహెచ్‌సీలో చేసిన స్టాఫ్‌నర్సు, ఆరోగ్య మిత్ర, 104, 108 స్టాఫ్, రెసిడెన్షియల్ కాలేజ్ స్టాఫ్‌కు సర్వీసు మార్కులు ఇస్తున్నామన్నారు. ఫైనల్ మెరిట్ లిస్టులో ఉన్న అభ్యంతరాల సర్టిఫికెట్లు మరలా ఉన్నతాధికారులతో స్క్రూట్నీ చేసి డీఎంహెచ్‌ఓలు, సూపరింటెండెంట్‌ల నుంచి జన్యునిటీ ఆధారంగా సెలక్షన్ లిస్టును విడుదల చేస్తామని వెల్లడించారు.


