నర్సింగ్‌ ఉద్యోగాల్లో నకిలీలలు | - | Sakshi
Sakshi News home page

నర్సింగ్‌ ఉద్యోగాల్లో నకిలీలలు

Jun 3 2026 1:15 AM | Updated on Jun 3 2026 1:15 AM

నర్సింగ్‌ ఉద్యోగాల్లో నకిలీలలు రూ. లక్షల్లో బేరాలు

గుంటూరు మెడికల్‌ : అర్హత లేకున్నా ఉద్యోగాలు పొందేందుకు కొందరు నర్సింగ్‌ అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారు. ఉద్యోగం చేయకపోయినా నకిలీ అనుభవ ధ్రువపత్రాలు తయారు చేసి ఉద్యోగాలు పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. వైద్య అధికారులు కొందరి సర్టిఫికెట్లను నకిలీవిగా నిర్ధారించి ఆయా జిల్లాల వైద్య అధికారులకు పరిశీలించాలని వెనక్కు పంపించారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులు ఇలా ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది.

పోస్టులకు తీవ్ర పోటీ

ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల గవర్నమెంట్‌ జనరల్‌ ఆసుపత్రిలో 150 కాంట్రాక్టు స్టాఫ్‌నర్సు పోస్టులకు మార్చి నెలలో గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన 7 వేల మందికిపైగా జనరల్‌ నర్సింగ్‌ అండ్‌మిడ్‌ వైఫరీ (జీఎన్‌ఎం), బీఎస్సీ నర్సింగ్‌, ఎమ్మెస్సీ నర్సింగ్‌ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏప్రిల్‌ మొదటి వారం వరకు దరఖాస్తుకు గడువు ఇచ్చారు. గత నెల చివరిలో అభ్యర్థుల ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్టును, ఫైనల్‌ మెరిట్‌ లిస్టును సైతం ఆర్డీ కార్యాలయం అధికారులు విడుదల చేశారు. స్క్రూట్నీ సమయంలో పలు నకిలీ సర్టిఫికెట్లు ఉన్నాయని గమనించి ఆర్డీ కార్యాలయం అధికారులు నిజ నిర్ధారణ కోసం వెనక్కు పంపించారు. ఈ అంశం నేడు మూడు జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది.

కరోనా సమయంలో పనిచేసినట్లుగా...

కరోనా సమయంలో పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు వైద్య సేవలు అందించినట్లు, ప్రభుత్వ నోటిఫికేషన్‌ల సమయంలో కాంట్రాక్టు స్టాఫ్‌నర్సు ఉద్యోగాలు పొంది పనిచేసినట్లుగా మూడు జిల్లాలకు చెందిన పలువురు నర్సింగ్‌ అభ్యర్థులు సర్టిఫికెట్లు అందజేశారు. వీటిపై ఫిర్యాదులు రావడంతో కొన్ని సర్టిఫికెట్లు నకిలీవిగా ఆర్డీ కార్యాలయం అధికారులు తేల్చారు. అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతోనే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొంతమంది అభ్యర్థుల అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లకు, వారు పనిచేసిన సమయంలో పొందిన బ్యాంకు ఖాతాలకు పొంతన లేకపోవడంతో ఆర్డీ కార్యాలయం అధికారులు ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. మూడు జిల్లాలకు చెందిన వైద్య అధికారులకు వాటిని పరిశీలన నిమిత్తం వెనక్కు పంపించారు. ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్టులో అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ వాటిని సరిదిద్దకుండా మరలా ఫైనల్‌ మెరిట్‌ లిస్టు విడుదల చేయడంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో పనిచేసిన కొంత మంది వ్యక్తులకు ఎక్స్‌పీరియన్స్‌ మార్కులను కలపకుండా పనిచేయకుండానే ఫేక్‌ సర్టిఫికెట్లు సృష్టించిన వారికి ఉద్యోగాలు వచ్చేలా మార్కులు కలిపారని పలువురు నర్సింగ్‌ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రొవిజనల్‌ మెరిట్‌ లిస్టులో అభ్యంతరాల పరిశీలన అనంతరం విడుదల చేసిన ఫైనల్‌ మెరిట్‌ జాబితాలో తప్పిదాలు ఉన్నాయని, వాటిపై అప్పీలు చేసేందుకు గడువు కేవలం 24 గంటలు ఇవ్వడం వల్ల తమకు చెప్పే అవకాశం లేకుండా పోయిందని వాపోయారు.

పరిశీలనకు వెనక్కు పంపాం

నకిలీ ఫేక్‌ సర్టిఫికెట్లు వచ్చిన విషయాన్ని తాము గుర్తించామని ఆర్డీ డాక్టర్‌ జి.శోభారాణి తెలిపారు. ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్లు విడుదల చేసిన ఆయా ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులకు పంపించి నిర్ధారణ చేయాలని ఆదేశించామన్నారు. అభ్యర్థుల అభ్యంతరాలను సైతం పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, పూర్తి పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడతామన్నారు.

పిడుగురాళ్ల జీజీహెచ్‌లో

నకిలీ అర్హత ధ్రువపత్రాల కలకలం

ఆర్డీ కార్యాలయ పరిశీలనలో

వెలుగులోకి వ్యవహారం

కొలువు ఇప్పిస్తామని రూ. లక్షల్లో

వసూలు చేస్తున్న దళారులు

అభ్యంతరాలు స్వీకరించకుండానే

తుది మెరిట్‌ జాబితా విడుదల

కాంట్రాక్టు స్టాఫ్‌ నర్సు పోస్టులను ఇప్పిస్తామంటూ కొందరు మధ్యవర్తులు రూ. లక్షల్లోనే వసూలు చేశారనే ఆరోపణలు అభ్యర్థుల నుంచి వినిపిస్తున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు తీసుకుని ఉద్యోగం ఇప్పిస్తామంటూ రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు వసూలు చేసినట్లు నర్సింగ్‌ అభ్యర్థులు చర్చించుకుంటున్నారు. దళారుల ప్రమేయం వల్ల అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇస్తారేమోననే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దళారులను ఆశ్రయించిన వారికే ముందస్తుగా ప్రొవిజనల్‌ లిస్టు జాబితాకు చేరుకోవడం వారి అనుమానాలకు ఊతమిస్తోందని చెబుతున్నారు. కార్యాలయంలో కొంత మంది సిబ్బంది సహకారం వల్లే దళారులు కార్యాలయం సమాచారం సేకరించి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement