తెనాలిటౌన్: ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను మరింత విస్తృతం చేసుకోవాల్సిందిగా భారత ప్రభుత్వ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ విభాగం డైరెక్టర్ సురభి మాలిక్ మున్సిపల్ అధికారులకు సూచించారు. భారత ప్రభుత్వ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ విభాగం డైరెక్టర్ సురభి మాలిక్, ఏడీబీ కన్సల్టెంట్ మనోజ్‌కుమార్, ఎన్‌పీఎంయూ దీపక్ గోయల్‌లు మంగళవారం తెనాలి పట్టణంలో పర్యటించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని కంపోస్టు యార్డులో ఘన వ్యర్థాల నిర్వహణ, పూలే కాలనీలోని 10 ఎంఎల్‌డీ మురుగునీటి శుద్ధి ప్లాంటును పరిశీలించారు. తెనాలి పట్టణంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ జరగటంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. కంపోస్టు యార్డులో చెత్త నిర్వహణను ఇప్పుడున్న 1.47 లక్షల టన్నులకు మించేలా చూడాలని చెప్పారు. పూలే కాలనీలోని 10 ఎంఎల్‌డీ ద్రవవ్యర్థాల నిర్వహణ సామర్థ్యాన్ని 15–20 ఎంఎల్‌డీకి పెంచుకోవాలని సూచించారు. మొక్కల సంఖ్యను అధికంగా ఉండేలా చూడాలని సురభి మాలిక్ చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటి నుంచి నాలుగు బుట్టల్లో చెత్త సేకరణ జరగాల్సి ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె.రామఅప్పల నాయుడు, ఆరోగ్య అధికారి డాక్టర్ మొవ్వా ఏసుబాబు, మున్సిపల్ ఇంజినీర్ పి.శ్రీకాంత్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: జెడ్పీ ఆస్తుల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జెడ్పీ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో పరిపాలనాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ మండల పరిషత్ కార్యాలయాల పరిపాలనా వ్యవహారాలు, పెండింగ్ అంశాలు, ఆడిట్ అభ్యంతరాలు, కోర్టు కేసులపై విస్తృతంగా చర్చించారు. హెనీ క్రిస్టినా మాట్లాడుతూ మండల పరిషత్తు కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న లోకల్ ఫండ్, ఏజీ ఆడిట్ అభ్యంతరాలను త్వరితగతిన పరిష్కరించి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కోర్టు కేసుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ, ప్రస్తుత పరిస్థితిని రింగ్ ఫైళ్ల రూపంలో సిద్ధంగా ఉంచాలని సూచించారు. జెడ్పీకి సంబంధించిన ఆస్తుల వివరాలు, వాటి సంరక్షణ, రికార్డుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రభుత్వ ఆస్తుల రక్షణ ప్రతి అధికారికి ముఖ్య బాధ్యత అని స్పష్టం చేశారు. జెడ్పీ డిప్యూటీ సీఈవో సీహెచ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


