అర్జీల పరిష్కారంలో ప్రజల సంతృప్తే ప్రధాన లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారంలో ప్రజల సంతృప్తే ప్రధాన లక్ష్యం

Jun 2 2026 3:06 AM | Updated on Jun 2 2026 3:06 AM

పోలీసు పీజీఆర్‌ఎస్‌కు 160 అర్జీలు మలేరియా వ్యతిరేక మాసోత్సవాల ర్యాలీ గుంటూరు నగర పాలక సంస్థకు అంతర్జాతీయ పురస్కారం

జిల్లా కలెక్టర్‌ సి.యం.సాయికాంత్‌ వర్మ

గుంటూరు వెస్ట్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీల పరిష్కారంలో మానవత్వంతో వ్యవహరించాలని వివిధ శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్‌ సి.యం.సాయికాంత్‌ వర్మ సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల సంతృప్తి అంతిమ లక్ష్యంగా అర్జీలు పరిష్కరించాలన్నారు. ఎక్కువ రోజులు పెండింగ్‌లో ఉంచకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. పరిష్కారం చూపకుండానే అర్జీలను మూసివేసే అధికారులపై చర్యలు తప్పవన్నారు. ప్రజలతో అధికారులు, సిబ్బంది మర్యాదగా మలచుకోవాలని తెలిపారు. సమస్యలను పరిష్కరించమని అడిగే హక్కు ప్రజలకుంటుందన్న వాస్తవాన్ని మరచిపోకూడదన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధుల వద్దకు కలెక్టర్‌ స్వయంగా వెళ్లి అర్జీలు స్వీకరించారు. అనంతరం వచ్చిన 184 అర్జీలను కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ, డీఆర్వో షేక్‌ ఖాజావలి, జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, డిప్యూటీ కలెక్టర్‌ డేవిడ్‌ పరిశీలించారు.

నగరంపాలెం: లక్షల్లో నగదు చెల్లించి మోసపోయినట్లు బాధితులు వాపోయారు. నగరంపాలెం జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌ – గ్రీవెన్స్‌)కు 160 ఫిర్యాదులు వచ్చాయి. బాధితుల నుంచి జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదిదారుల సమస్యలను అలకించారు. బాధితులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని పోలీస్‌ అధికారులకు సూచించారు. జిల్లా ఏఎస్పీ (పరిపాలన) జీవీ.రమణమూర్తి, డీఎస్పీలు అబ్దుల్‌అజీజ్‌ (గుంటూరు తూర్పు), శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్‌), మధుసూదనరావు (గుంటూరు సీసీఎస్‌)లు కూడా అర్జీలు స్వీకరించిన వారిలో ఉన్నారు.

గుంటూరు మెడికల్‌: మలేరియా వ్యతిరేక మాసోత్సవాల్లో భాగంగా వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. స్టేట్‌ బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం మీదుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖధిఅకారి కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం, డీపీఎంఓ డాక్టర్‌ సుజాత, డెమో శివ సామిరెడ్డి, మలేరియా సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

నెహ్రూనగర్‌: గుంటూరు నగరపాలక సంస్థ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఐక్యరాజ్యసమితికి చెందిన యూనిడో (యునైటెడ్‌ నేషన్స్‌ ఇండస్ట్రీయల్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌) ప్రతిష్టాత్మక ‘జెండర్‌ ఈక్వాలిటీ మొబిలైజేషన్‌‘ అవార్డును గుంటూరు నగరానికి ప్రకటించింది. సోమవారం విజయవాడలోని లెమన్‌ ట్రీ ప్రీమియర్‌ హోటల్‌లో జరిగిన ’సస్టైయినబుల్‌ సిటీస్‌ ఇంటిగ్రేటెడ్‌ అప్రోచ్‌ పైలట్‌ ( ఎస్‌సీ ఐఏపీ)’ ప్రాజెక్ట్‌ వర్క్‌షాప్‌లో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ కె.మయూర్‌ అశోక్‌ ఈ అంతర్జాతీయ అవార్డును జీఎంసీ మహిళా కార్మికులతో కలిసి కేంద్ర స్వచ్ఛ భారత్‌ మిషన్‌ డైరెక్టర్‌ సురభి మాలిక్‌ చేతుల మీదుగా అందుకున్నారు. మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణను అనుసంధానిస్తూ గుంటూరు నగరపాలక సంస్థ అమలు చేసిన వినూత్న విధానాలకుగాను ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించిందని కమిషనర్‌ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement