సంగం డెయిరీ రైతులదా... టీడీపీ ఎమ్మెల్యే నరేంద్రదా? | - | Sakshi
Sakshi News home page

సంగం డెయిరీ రైతులదా... టీడీపీ ఎమ్మెల్యే నరేంద్రదా?

Jun 2 2026 3:06 AM | Updated on Jun 2 2026 3:06 AM

● నరేంద్ర అక్రమాలపై ఈడీ, సీబీఐతో విచారణ జరిపించాలి ● మామిళ్లపల్లిలో మహిళలపై తప్పుడు కేసులు పెట్టించారు ● వైఎస్సార్‌సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ

గుంటూరు ఎడ్యుకేషన్‌: రైతుల సంక్షేమం కోసం సహకార రంగంలో స్థాపించిన సంగం డెయిరీని లిమిటెడ్‌ కంపెనీగా మార్చిన టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర డెయిరీ ఆస్తులతో ప్రైవేటుగా వ్యాపారాలు సాగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. సంగం డెయిరీ ముసుగులో నరేంద్ర చేస్తున్న అక్రమాలపై ఈడీ, సీబీఐలతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. గుంటూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘సంగం డెయిరీ రైతులదా.. ధూళిపాళ్ల నరేంద్రదా అనే విషయం తేల్చాలి. మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేయించాలని రైతుల పక్షాన వైఎస్సార్‌ సీపీ చేస్తున్న పోరాటాన్ని అణగదొక్కేందుకు నరేంద్ర ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తున్నారు. మామిళ్లపల్లి గ్రామంలో రైతులు పంట నిల్వ చేసుకున్న గోదాముకు నరేంద్ర ప్రోద్బలంతో సీలు వేసినప్పటికీ... విచారణ అనంతరం కలెక్టర్‌ ఆదేశాలతో తిరిగి తెరిచారు. సంఘటన జరిగిన తర్వాత మామిళ్లపల్లిలో ఆరుగురు కాపు, నలుగురు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వివాదం సర్దుమణిగిన తర్వాత శాంతి, భద్రతల పేరుతో మహిళలపై కేసులు నమోదు చేయడం దుర్మార్గం. వీరితోపాటు మామిళ్లపల్లిలో మరో 14 మందిపై ఎమ్మెల్యే నరేంద్ర తప్పుడు కేసులు పెట్టించారు. మొక్కజొన్న పంట కొనుగోలు వ్యవహారం, రైతులకు జరిగిన అన్యాయంపై వైఎస్సార్‌సీపీ సాగిస్తున్న పోరాటాన్ని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. అక్రమ కేసులను తొలగించే వరకు న్యాయ పోరాటం చేస్తాం’’ అని స్పష్టం చేశారు.

జైలుకు వెళ్లేందుకు నరేంద్ర

సిద్ధం కావాలి

‘‘మహిళలపై పెట్టిన కేసులను తక్షణం ఉపసంహరించుకోకుంటే తప్పుడు కేసులు పెట్టిన పోలీసుల ఉద్యోగాలను వైఎస్సార్‌ సీపీ అధికారంలోకా రాగానే ఊడగొడతాం. ఎమ్మెల్యే నరేంద్ర సైతం జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. కాపు మహిళలపై మోపిన తప్పుడు కేసులపై పవన్‌ కళ్యాణ్‌ నోరు విప్పాలి. మరోవైపు డెయిరీ స్థలంలో తండ్రి పేరుతో నరేంద్ర డీవీసీ ఆస్పత్రి నిర్మించి, వ్యాపారం చేస్తున్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసమే ఆస్పత్రి నిర్మించారు తప్ప అక్కడ పనిచేస్తున్న వైద్యులకు సరైన అర్హతలు లేవని ప్రజలే ఆరోపిస్తున్నారు. పదేళ్లుగా సంగం డెయిరీ చైర్మన్‌ పదవిలో గుత్తాధిపత్యం చేస్తున్న నరేంద్ర వ్యవహారంపై సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉంది. పొన్నూరు నియోజకవర్గంలో దళారీలా మారిన నరేంద్ర రైతుల పంటలకు గిట్టుబాటు ధర రాకుండా అడ్డుకుంటున్నారు. రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు’’ అని అంబటి మురళీకృష్ణ ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement