సుందరం చేస్తారా.. | - | Sakshi
Sakshi News home page

సుందరం చేస్తారా..

Jun 1 2026 3:55 AM | Updated on Jun 1 2026 3:55 AM

జీజీహెచ్‌ నూతన సూపరింటెండెంట్‌గా సుందరాచారి

కొత్త సూపరింటెండెంట్‌కు సమస్యల స్వాగతం సమయపాలన పాటించని సీనియర్‌ వైద్యులు కార్యాలయంలో ప్రతి పనికి మామూళ్లు పుట్టినా, గిట్టినా లంచాలు చెల్లించాల్సిందే రాత్రిళ్లు అందుబాటులో ఉండని మహాప్రస్థానం వాహనాలు వైద్య సిబ్బందిలో లోపించిన జవాబుదారీతనం

పేషెంట్‌ కేర్‌ కోసం ఏదైనా చేస్తా..

జీజీహెచ్‌ నూతన సూపరింటెండెంట్‌గా సుందరాచారి

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ ఎన్‌.వి.సుందరాచారీ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఆసుపత్రిలో పలు సమస్యలు ఆయనకు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా సీనియర్‌ వైద్యులు సమయపాలన పాటించడం లేదు. నిబంధనల ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రొఫెసర్లు, అసోసియేట్‌లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు జీజీహెచ్‌లో అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలి. కానీ పలువురు సీనియర్‌ వైద్యులు మధ్యాహ్నం కల్లా సొంత క్లినిక్‌లు, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిపోతున్నారు. కొంత మంది వైద్యులు ఉదయం ఓపీలకు డుమ్మా కొట్టి వార్డుల్లో రౌండ్స్‌ వేసి వెళ్లిపోతున్నారు. ఫలితంగా జూనియర్‌ వైద్యులతోనే రోగులకు ఓపీ సేవలు అందుతున్నాయి. మధ్యాహ్నం నుంచి బెడ్‌సైట్‌ టీచింగ్‌ చేయాల్సిన వైద్యులు దాన్ని మరిచిపోయారు. ఉదయం ఓపీ వేళల్లోనే రోగులను చూడకుండా టీచింగ్‌ చెప్పి మధ్యాహ్నం నుంచి సొంత పనులపై వెళ్లిపోతున్నారు. తద్వారా వైద్య విద్యార్థులకు నాణ్యమైన బోధన లభించడం లేదు.

కార్యాలయంలో లంచావతారులు

పరిపాలనా కార్యాలయంలో ఏఫైల్‌ ముందుకు కదలాలన్నా లంచం తప్పనిసరి అని బాధితులు వాపోతున్నారు. పదోన్నతులు ఇవ్వాలన్నా, ఫైల్‌ముందుకు వెళ్లాలంటే మామూళ్లు ముట్టజెప్పాల్సిందే. రీయింబర్స్‌మెంట్‌, ఆసుపత్రుల తనిఖీలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ఉద్యోగ నియామకాలు, సర్వీసు క్రమబద్ధీకరణ, బిల్లుల చెల్లింఽపులు ఇలా ప్రతి విషయానికి మామూళ్లు ముట్టజెబితేనే ఫైల్స్‌ కదులుతున్నాయని పలువురు యూనియన్‌ నాయకులు సైతం వాపోతున్నారు. కార్యాలయంలో పరిపాలనా అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. అడ్మినిస్ట్రేషన్‌ పరంగా వైద్య కళాశాల ఏడీ, జీజీహెచ్‌ ఏడీ మధ్య సమన్వయలోపంతో పలు ఫైల్స్‌ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంటున్నాయి. నర్సింగ్‌ కార్యాలయంలో మామూళ్ల మోతతో బెంబేలెత్తిపోతున్నారు. ఫోన్‌పేలు చెల్లించుకుని నచ్చిన చోట డ్యూటీలు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీర్ఘకాలికంగా కొంత మంది సిబ్బందికి ఓపీ విభాగాలు, ఆపరేషన్‌ థియేటర్లు, ఆరోగ్యశ్రీ పారితోషకాలు వచ్చే వార్డుల్లోనే డ్యూటీలు వేస్తున్నారని, వారి వద్ద మామూళ్లు తీసుకోవడం వల్లే కంటిన్యూగా ఒకే వార్డులో ఉంచుతున్నట్లు వాపోతున్నారు.

క్యాజువాల్టీలో సమస్యలు క్యాజువల్‌!

జీజీహెచ్‌కు గుండెకాయలాంటి క్యాజువాల్టీని చక్కబెట్టాల్సిన బాధ్యత నూతన సూపరింటెండెంట్‌పై ఉంది. క్యాజువాల్టీలో ఎమర్జెన్సీ మెడిసిన్‌ వైద్యులు, డ్యూటీ అసిస్టెంట్‌ ఫిజీషియన్లు, డ్యూటీ అసిస్టెంట్‌ సర్జన్‌లు అందుబాటులో ఉండటం లేదని పలు మార్లు ఫిర్యాదులు వచ్చాయి. క్యాజువాల్టిని పర్యవేక్షణ చేయాల్సిన సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఓ, డెప్యూటీ ఆర్‌ఎంఓలు ఆసుపత్రిలో నివాసం ఉండటం లేదు. వారే డ్యూటీలో ఉండకపోవడం వల్ల కింది స్థాయి ఉద్యోగులు సక్రమంగా విధులకు హాజరు కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రివేళల్లో చికిత్సకోసం వచ్చిన వారు సకాలంలో వైద్య సేవలు అందక కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.

సమస్యలపై దృష్టి సారించాలి

గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాదిలోనే రూ. 10 కోట్ల దాతల విరాళాలతో కళాశాలను అభివృద్ధి చేసి రాష్ట్రంలో రోల్‌మోడల్‌గా గుంటూరు వైద్య కళాశాలను డాక్టర్‌ సుందరాచారీ తీర్చిదిద్ది పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. గతంలో జీజీహెచ్‌లో న్యూరాలజీ విభాగాధిపతిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దాతల సహాయంతో పక్షవాత రోగుల కోసం స్ట్రోక్‌ యూనిట్‌, స్ట్రోక్‌ ఐసీయూను, స్లీప్‌ ల్యాబ్‌ను ఏర్పాటు చేయించి, పేదలకు కార్పొరేట్‌ వైద్య సేవలు అందేలా చేశారు. సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపడుతున్న తరుణంలో ఆసుపత్రిలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పేదలకు మెరుగైన వైద్య సేవలు, సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని పలువురు బాధితులు నూతన సూపరింటెండెంట్‌ను కోరుతున్నారు.

బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ సుందరాచారి

గుంటూరు మెడికల్‌: పేషెంట్‌ కేర్‌ కోసం ఏదైనా చేస్తానని గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగార్జునకొండ వెంకటసుందరాచారి అన్నారు. అవసరమైతే రోగిని వీల్‌చైర్‌లో తానే తీసుకెళ్లి చికిత్స అందిస్తానని చెప్పారు. ఆదివారం డాక్టర్‌ యశస్వి రమణ నుండి డాక్టర్‌ సుందరాచారి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం డాక్టర్‌ సుందరాచారి మీడియాతో మాట్లాడుతూ జీజీహెచ్‌ క్యాజువాలిటీ వైద్యసేవలు మెరుగుపరుస్తామని తెలిపారు. కుటుంబంలో ఎవరికై నా అనారోగ్యం వచ్చి అత్యవసర వైద్యసేవలు కావాలనుకుంటే వారు మొట్టమొదట గా జీజీహెచ్‌ క్యాజువాల్టీకి వెళ్లి వైద్యసేవలు పొందాలనే తరహాలో క్యాజువాల్టీ సేవలు మెరుగుపరుస్తామని వెల్లడించారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ ఎన్‌.వి. సుందరాచారికి ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్‌, డెప్యూటీ కలెక్టర్‌ చిన్నం సుధారాణి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పూసల శ్రీనివాసరావు, అడ్మినిస్ట్రేటర్‌ బచ్చు ప్రవీణ్‌కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌లు జమ్ముల అరుణ్‌, నూతక్కి శ్రీకాంత్‌, వేణు, లంకపల్లి శ్రీనివాస్‌,జీవీ కోటేశ్వరరావు, జూనియర్‌ అసిస్టెంట్స్‌ వాసిరెడ్డి కార్తిక్‌, తిరుపతిరావు, ఆనంద్‌, పలువురు నర్శింగ్‌ సిబ్బంది తదితరులు శాలువా కప్పి, బొకే అందజేసి అభినందనలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement