నాణ్యమైన పసుపునకు అడ్డా తూములూరు
వైఎస్సార్ కడప జిల్లా నుంచి మేలైన విత్తన రకం దిగుమతులు ఇక్కడి నుంచే 45ఏళ్లుగా ఇతర రాష్ట్రాలకు సరఫరా ఈ ఏడాది తగ్గిన దిగుమతులు జూన్‌లో అమ్మకాలు ప్రారంభం
పసుపు విత్తనంలో రకాలు ఇలా..
గుంటూరు, కృష్ణా, ఇతర రాష్ట్రాలలోని రైతులు విత్తన మార్పిడికి వైఎస్సార్ కడప జిల్లాలో పండిన పసుపును విత్తనానికి వాడతారు. దీంతో కడప పసుపు విత్తనాలకు గిరాకీ ఉంది. మా తాతలు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ గ్రామానికి కడప పసుపు తీసుకువచ్చి ఇక్కడకు వచ్చే రైతులకు అమ్మేవారు. ఇక్కడ విత్తన పసుపునకు మార్కెట్ ఏర్పడటం, గిట్టుబాటు ధర, అన్ని సౌకర్యాలు ఉండటంతో ఇక్కడ క్రయవిక్రయాలకు ఆసక్తి చూపుతున్నాం. మహారాష్ట్రలోని సాంగ్లీ ప్రాంతంలో ఈ ఏడాది పంట దిగుమతులు సరిగా లేనందున ఈ ఏడాది ఇక్కడ నుంచి గతంలో కంటే అధికంగా విత్తనం అక్కడికి వెళుతుంది. దీంతో ఈ సారి విత్తనానికి డిమాండ్ పెరిగే అవకాశం ఎక్కువుగా ఉంది.
– బి.పి.తిరుమలేష్, యువ రైతు, మైదుకూరు, వైఎస్సార్ కడప జిల్లా
కొల్లిపర: వైఎస్సార్ కడప జిల్లా నుంచి గుంటూరు జిల్లా తెనాలి నియోజక వర్గం పరిధిలోని కొల్లిపర మండలంలోని తూములూరు గ్రామానికి పసుపు విత్తనం మార్చి నెలలో దిగుమతులు చేసుకుని మే చివరి వారంలోను, జూన్ మొదటి వారంలోను తొలకరి వర్షాలు రాగానే గ్రామంలో అమ్మకాలు ప్రారంభిస్తారు. ఈ సారి కడప నుంచి దిగుమతులు తక్కువ రావటంతో పుట్టి సుమారు రూ.7500 నుంచి రూ.8000 వరకు పలికే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొల్లిపర మండంలోని రైతులు, వైఎస్సార్ కడపజిల్లాలోని మైదుకూరు గ్రామంలోని వ్యాపారులు కలసి అక్కడి నుంచి పసుపు విత్తనాన్ని దిగుమతి చేసుకుని తూములూరు గ్రామంలో రెండు నెలలు నిల్వ చేసి తొలకరి వర్షాలు రాగానే ఇక్కడి నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాలతోపాటు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. పసుపు విత్తన క్రయవిక్రయాలకు తూములూరు గ్రామం కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది.
నాణ్యమైన విత్తనాలు లభ్యం
గత 45 ఎళ్లుగా కడప జిల్లా లో వివిధ ప్రదేశాలల్లో పండిన పసుపును విత్తనం నిమిత్తం తూములూరు గ్రామానికి తెచ్చి విక్రయిస్తున్నారు. ఏటా 17వేల నుంచి 18 వేల పుట్ల వరకు పచ్చి పసుపు విత్తనం గ్రామానికి దిగుమతి అవుతుంది. ఒక పుట్టికి 225 కిలోలు ఉంటుంది. ఏడాది గ్రామంలోకి 240 లారీలకు గాను 14,400 పుట్లు దిగుమతి వ్యాపారులు చేశారు. గత సంవత్సరం 300 పై చిలుకు లారీల ద్వారా దిగుమతి చేసుకుంటే ఈ సంవత్సరం సుమారు 100 లారీలు తక్కువ లారీలు దిగుమతి అయ్యాయి. దీంతో విత్తనం డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఇలా దిగుమతి చేసుకున్న విత్తనం రాష్ట్రంలోని వివిధ జిల్లాల రైతులతో పాటు ఒడిశా నుంచి కూడా పసుపు రైతులు వచ్చి కొనుగోలు చేస్తారు. పసుపు వ్యాపారానికి ప్రతి ఏటా కాటా పాట జరుగుతుంది. దీనికి సంబంధించిన రాబడి గ్రామ పంచాయతీకి చెల్లిస్తారు. దీని ద్వారా గ్రామంలో సుమారు 250 మందికి మూడు నెలలు పాటు ఉపాధి లభిస్తోంది. ఈ ఎడాది మహారాష్ట్రలో పసుపు దిగుబడులు తక్కువగా ఉండటం వలన ఇప్పటికే ఇక్కడ నుంచి సుమారు 50 లారీల పసుపు మహారాష్ట్రకి పంపటానికి వ్యాపారులు ఇప్పటికే సిద్ధమవుతున్నారు.
రెండేళ్లుగా నిరాశే!
గత రెండేళ్లుగా ఎండు పసుపునకు గిట్టుబాటు ధర లేక పోవటంతో రైతుల్లో ఆసక్తి కొరవడింది. కౌలు ఎకరాకు రూ.70 వేలకు ఉండడం, కూలీ రేట్లు, ఎరువుల ధరలు అమాంతం పెరగటంతో రైతులు పసుపు సాగు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. గతేడాది కడప వ్యాపారస్తులు 17వేల పుట్లు నిల్వ ఉంచగా, ఆశించిన ధర పలక పోవడంతో నష్టాలను చవిచూశారు. దీంతో ఈ ఏడాది 14వేల పుట్లు నిల్వ చేశారు. ఈసారి మహారాష్ట్రలో పసుపు దిగుబడులు రాకపోవటంతో ఇప్పటికే కొంత మంది రైతులు ఇక్కడ ఉన్న పసుపు విత్తనాన్ని పావు వంతు కొనుగోలు చేశారు. దీంతో తక్కువ దిగుమతి చేసుకోవడం, ఇప్పుడు ముందుగానే కొనుగోలు కొంత జరగటం వలన విత్తన పసుపునకు మరో 10 రోజుల్లో డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు భావిస్తున్నారు. పస్తుతం పుట్టు రూ.7500 నుంచి రూ.8000 వరకు అమ్మకాలు ప్రారంభించారు. గత ఏడాది జూన్ నెలలో పుట్టు రూ.5500 నుంచి రూ.7000 వరకు అమ్మినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
పసుపు విత్తనంలో పలు రకాలు ఉన్నాయి. టేకూరు పేట, బాక్రాపేట, తమిళనాడు సేలం, సుగంథ, కడప, మైదుకూరు, ప్రగడ వరం వంటి రకాలు ఇక్కడ ప్రతి ఏడాది దిగుమతి అవుతాయి. ఈ సారి గ్రామంలోకి తమిళనాడు సేలం, మైదుకూరు కడప వంటి పసుపు విత్తనాలు మాత్రమే దిగుమతి అయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. కొల్లిపర మండలంలో ఎక్కువ శాతం రైతులు సేలం రకం విస్తారంగా సాగు చేస్తారు. మిగిలిన జిల్లాలోని రైతులు వారి పంట భూములకు అనుకూలంగా ఉందే విత్తనాలను కొనుగోలు చేస్తారు.


