జీజీహెచ్ కాన్పుల విభాగంలో పురుడుపోసుకున్న వారు తమ బిడ్డను కళ్లారా చూడాలంటే తమ చేతుల్లోకి తీసుకుని ముద్దాడాలంటే అక్కడ ఉన్న వైద్య సిబ్బందికి మగబిడ్డకు ఒకరేటు, ఆడబిడ్డకు మరో రేటు చొప్పున మామూళ్లు ముట్టజెప్పాల్సిందే. చికిత్స పొందుతూ ఎవరైనా చనిపోతే పోస్టుమార్టం చేసేందుకు మార్చురీలో ముక్కుపిండి మామూళ్లు వసూలు చేస్తారు. చనిపోయిన వారిని ఉచితంగా తరలించేందుకు ఏర్పాటు చేసిన మహాప్రస్థానం వాహనాలు రాత్రిళ్లు అందుబాటులో ఉండటం లేదు. ఫలితంగా ప్రైవేటు అంబులెన్సులు ఆశ్రయించి మృతుల బంధువులు ఆర్ధికంగా నష్టపోతున్నారు. పగలు మహాప్రస్తానం వాహనాల్లో భౌతికకాయాలు తీసుకెళ్లినప్పటికీ కొంత మేరకు ముడుపులు చెల్లించాల్సి వస్తుందని మృతుల బంధువులు వాపోతున్నారు.


