బ్లేడుతో గొంతు కోసుకున్న యువకుడు | - | Sakshi
Sakshi News home page

బ్లేడుతో గొంతు కోసుకున్న యువకుడు

Jun 1 2026 3:55 AM | Updated on Jun 1 2026 3:55 AM

పంట కాలువలోకి దూసుకెళ్లిన కారు

జీజీహెచ్‌కు తరలించిన పోలీసులు చోరీ కేసులో స్టేషన్‌కు వచ్చిన యువకుడు స్టేషన్‌ బయట వీరంగం చేసిన తల్లి, కుమారుడు

లక్ష్మీపురం: చోరీ కేసు లో విచారణ నిమిత్తం ఆదివారం రాత్రి పోలీసుస్టేషన్‌కు వచ్చిన ఓ యువకుడు బ్లేడుతో గొంతు కోసుకున్న ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. గుంటూరు కొరిటెపాడు ప్రాంతానికి చెందిన తమలపల్లి దుర్గ హోటల్‌లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె భర్త మార్క్‌ అనారోగ్యంతో మృతి చెందాడు. ఆమెకు ఒక మగ, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. ముగ్గురికి వివాహం అయింది. రెండో కుమార్తె నాగతేజ, అల్లుడు రాజశేఖరరెడ్డి ఇద్దరు కలిసి ఏప్రిల్‌ నెలలో వారి వద్ద ఉన్న 26 గ్రాముల బంగారం, వెండి, రూ.37 వేలు నగదు తల్లి వద్ద భద్రపరిచారు. దుర్గ తమ్ముడు వెంకటేశ్వర్లు నిత్యం మద్యం తాగుతుంటాడు. ఏప్రిల్‌ 29వ తేదీన వెంకటేశ్వర్లు తన అక్క ఇంట్లో లేని సమయంలో వచ్చి బీరువాలో ఉన్న బంగారం, వెండి, నగదును చోరీ చేసి పరారయ్యాడు. దుర్గ ఇంటికి వచ్చిన తర్వాత బీరువా తెరచి చూడగా సొత్తు కనిపించలేదు. దీంతో ఇల్లు అంతా వెతుకలాడింది. తన తమ్ముడు ఇంటికి వచ్చినట్లు తెలుసుకుని అతడిని నిలదీయగా ఎలాంటి సమాధానం చెప్పలేదు. మే 18వ తేదీన జిల్లా ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసింది. అరండల్‌పేట పోలీసులు వెంకటేశ్వర్లును స్టేషన్‌కు పిలిపించి కేసు నమోదు చేసి విచారించారు. పోలీసుల విచారణలో చోరీ చేసిన బంగారం, వెండి, నగదు విజయవాడ మొఘల్‌రాజపురంలో నివాసం ఉంటున్న వెంకటేశ్వర్లు భార్య మాదిగాని జయ, కుమారుడు గోపీలకు ఇచ్చినట్లు అంగీకరించాడు. అరండల్‌పేట పోలీసులు తల్లి, కుమారుడిని పిలిపించారు. పోలీస్‌ స్టేషన్‌ వద్దకు వచ్చిన వెంకటేశ్వర్లు భార్య జయ, కుమారుడు గోపి వీరంగం వేశారు. తన తండ్రిని ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, ఈ బంగారం, వెండి, నగదు చోరీ వ్యవహరం తమకు తెలియదంటూ కొద్దిసేపు స్టేషన్‌ బయట వీరంగా చేసి గోపి బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గోపికి స్వల్ప గాయం కావడంతో గమనించిన పోలీసులు జీజీహెచ్‌కి తరలించారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం

ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు

చిలకలూరిపేటటౌన్‌: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకుపోవడంతో ఐదుగురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని పసుమర్రు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులంతా తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం త్రిపురారం గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. త్రిపురారం గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు కారులో చీరాల బీచ్‌ విహారయాత్రకు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపి, తిరిగి సొంతూరికి ప్రయాణమయ్యారు. కారు చిలకలూరిపేట మండలం పసుమర్రు పరిసరాల్లోకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి, అతివేగంతో రహదారి పక్కనే ఉన్న పొలాల కాలువలోకి దూసుకువెళ్లింది. ప్రమాద తీవ్రతకు కారు తీవ్రంగా దెబ్బతినగా, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, హైవే సిబ్బంది వెంటనే స్పందించి కారులో చిక్కుకున్న యువకులను వెలుపలికి తీశారు. 108 వాహనంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో బాల్టి ప్రదీప్‌ అనే యువకుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement