ఇది శుభం కాదు | - | Sakshi
Sakshi News home page

ఇది శుభం కాదు

May 31 2026 1:24 AM | Updated on May 31 2026 1:24 AM

అప్పుడేమో మార్కెట్‌ రేటు ప్రకారం పరిహారం ఇవ్వాలన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రూ.7 వేలే ఇస్తామంటూ మంత్రి హామీ రెండేళ్లు గడిచాక బీమాతో కలిపి రూ.5 వేలకు ఫైనల్‌ సెటిల్మెంట్‌ అంటూ మెలిక ఆవేదన వ్యక్తం చేస్తున్న అగ్నిప్రమాద బాధిత పసుపు రైతులు

రూ.5వేలకు ఫైనల్‌ సెటిల్మెంట్‌!

శుభం కోల్డ్‌స్టోరేజీ వ్యవహారంలో రైతులతో టీడీపీ ప్రభుత్వం చెలగాటం

తెనాలి: ‘మంగళగిరి నియోజకవర్గంలోని దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజీలో 2024 జనవరి 19న జరిగిన అగ్నిప్రమాదంలో రైతులు కోల్పోయిన ప్రతి బస్తా పసుపు, ఇతర పంట ఉత్పత్తులు, వ్యవసాయ సామగ్రికి ప్రస్తుత మార్కెట్‌ ధరల ఆధారంగా పరిహారం చెల్లించాలి’...2024 ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీకి రాసిన లేఖలో అంశమిది. అన్నిటికీ బీమా చెల్లించడం ముఖ్యం...వ్యత్యాసాన్ని ప్రభుత్వం భరించాలనీ సూచించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే ఏడాది జూలై 10న రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో జరిగిన సమావేశంలో రైతులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు నష్టపరిహారంగా క్వింటాకు రూ.7 వేల చొప్పున చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. కోల్ట్‌స్టోరేజీలోని సరుకులు, నిర్మాణానికి వచ్చే బీమా మొత్తాన్ని రైతులు/వ్యాపారులకు చెల్లించేందుకు సంబంధిత యజమాని అంగీకారం తెలిపారు.

కాలి బూడిదైన 4వేల బస్తాల పంట

దుగ్గిరాలలోని శుభం మహేశ్వరి కోల్డ్‌స్టోరేజీలో 2024 జనవరి 19న అగ్రిప్రమాదం జరిగింది. అందులో రైతులు నిల్వ చేసుకున్న లక్షా నాలుగు వేల బస్తాల పసుపు పంట దగ్ధమైంది. మార్కెట్లో కొన్నేళ్లుగా పసుపు ధరల్లో నెలకొన్న మాంద్యం కారణంగా చాలామంది రైతులు కోల్డ్‌స్టోరేజీలో నిల్వ చేసుకున్నారు. మార్కెట్లో ధర వచ్చినపుడు అమ్ముకోవచ్చన్న ఆశతో గుంటూరు జిల్లా రైతులే కాకుండా బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్‌, తూర్పుగోదావరి, వైఎస్సార్‌ కడప జిల్లాలకు చెందిన దాదాపు 300 మందికిపైగా ఇక్కడ పసుపు పంటను నిల్వ చేసుకున్నారు. 2024 జనవరిలో సంక్రాంతి పండగ నాటికి క్వింటా ధర రూ.13,600కు చేరుకుంది. నేడో, రేపో కోల్ట్‌స్టోరేజి నుంచి పసుపును తీసుకుని మార్కెట్లో అమ్ముకుందామని రైతులు భావిస్తున్న సమయంలో అదే నెలలో అగ్నిప్రమాదం సంభవించింది. అప్పటికి పసుపునకు గల ధరలో సగానికి మాత్రమే బీమా చేసిన కోల్డ్‌స్టోరేజీ నిర్వాకం తెలిసి నివ్వెరపోయారు రైతులు. నిల్వ ఉన్న సరుకు విలువకు తగినట్టుగా రూ.115 కోట్లకు బీమా కాకుండా రూ.40 కోట్లకే ప్రీమియం చెల్లించి, తమను నట్టేట ముంచారని రైతులు ఆవేదన పడ్డారు. అప్పటి సాంఘికసంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జునను కలిశారు. ఆయన జిల్లా కలెక్టరును సంప్రదించగా, రైతులకు జరిగిన నష్టంపై విచారణ కమిటీని వేశారు. అంతటితో సార్వత్రిక ఎన్నికల హడావుడి మొదలైంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అగ్నిప్రమాద బాధిత రైతుల కమిటీ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిని కలిసింది. ప్రతిపక్ష నేతగా చంద్రబాబునాయుడు చెప్పినట్టు అప్పటి మార్కెట్‌ ధర క్వింటాలుకు రూ.13వేలు చొప్పున పరిహారం వచ్చేలా చూడాలని కోరారు. అందుకు ససేమిరా అన్న మంత్రి క్వింటాలుకు రూ.7 వేలు వచ్చేలా చూస్తామని చెప్పారు.

నెలలు గడుస్తున్నా మంత్రి హామీ కార్యరూపం దాల్చకపోవటంతో విసుగెత్తిన బాధిత రైతులు 2025 జనవరి 20న సంబంధిత బీమా కంపెనీ, తెనాలి శాఖ ఎదుట ధర్నాకు పిలుపు నిచ్చారు. మంత్రి లోకేశ్‌ కార్యాలయం సూచనపై ధర్నాను వాయిదా వేసుకున్నారు. కొన్ని నెలల తర్వాత బీమా పరిహారం రూ.20 కోట్లు వచ్చింది. ఆ మొత్తాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ గుంటూరు కార్యాలయంలో అందచేశారు. ఆ ప్రకారం ఒక్కో రైతుకు రూ.400 నుంచి రూ.2300 వరకు మాత్రమే లభించింది. మంత్రి హామీ ప్రకారం రావాల్సిన రూ.7 వేలకు వ్యత్యాసం కింద రావాల్సిన మొత్తం ఇప్పటివరకు అందనేలేదు. ఇప్పటికి రెండేళ్లు గడిచాయి. తీరా ఇప్పుడు మరో ప్రతిపాదనను రైతుల ముందుకు తెచ్చారు. గతేడాది కోల్డ్‌ స్టోరేజీ యాజమాన్యం ఇచ్చిన బీమా సొమ్ముతో కలిపి క్వింటాలుకు రూ.5 వేల చొప్పున ఇస్తామనీ, దానిని ఫైనల్‌ సెటిల్‌మెంట్‌గా భావించి సంతకాలు చేయాలంటూ కోల్డ్‌ స్టోరేజీ యజమాని ఓచర్లు పంపారు. మార్కెట్‌రేటు ప్రకారం పరిహారం చెల్లించాలన్న చంద్రబాబునాయుడు, అధికారంలోకి వచ్చాక రూ.7 వేలకు పరిమితం చేశారు. రెండేళ్లు గడిచాక ఇప్పుడు రూ.5 వేలకు ఫైనల్‌ సెటిల్మెంటు అంటూ సంతకాలు చేయాలనటం ఏమిటని రైతులు ఆవేదన పడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement