జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ
గుంటూరు వెస్ట్: ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. రహదారి భద్రత కమిటీ, మత్తు మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశాలు శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో జరిగాయి. సమావేశంలో జేసి మాట్లాడుతూ ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. సీఆర్‌డీఏ ప్రాంతంలో సీడ్ యాక్సెస్ రోడ్‌పై ప్రమాదాల పట్ల పర్యవేక్షణ చేయాలని సూచించారు. అవసరమైతే బారికేడింగ్ పెట్టాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై గట్టి నిఘా పెట్టాలని తెలిపారు. నరసరావుపేట రహదారిలో డోకిపర్రు వద్ద ప్రమాదాల నివారణకు ఆక్రమణలు తొలగించాలన్నారు. వెస్ట్రన్ బైపాస్ వద్ద ప్రమాదాల నివారణకు సూచిక బోర్డులు, ఏ దిశగా వెళ్లాలో స్పష్టంగా తెలిసే విధంగా ఏర్పాటుచేయాలని సూచించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ సమర్ధవంతంగా చేపట్టాలన్నారు. యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పారు. విద్యాసంస్థలు, వాటి చుట్టుప్రక్కల ఎట్టి పరిస్థితుల్లోను మాదక ద్రవ్యాలకు చోటు లేకుండా చూడాలన్నారు. ఉప రవాణా కమిషనర్ కే సీతారామిరెడ్డి మాట్లాడుతూ రహదారులపై ఎన్.హెచ్.ఏ.ఐ పరిధిలో 19, రహదారులు, భవనాలు శాఖ పరిధిలో 16 బ్లాక్ స్పాట్ లను గుర్తించామని చెప్పారు. డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, జిల్లా అటవీ అధికారి ఎం.హిమ శైలజ, డీఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


