అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేసిన చంద్రబాబు ప్రభుత్వం
గుంటూరు ఎడ్యుకేషన్: అర్హత కలిగిన నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టులు ఇవ్వకుండా అవినీతి, అక్రమాలతో నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ ముమ్మాటికీ దగా డీఎస్సీ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, విద్యార్థి విభాగ నాయకులు ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీపై సీబీఐతో విచారణ జరిపించాలని, అక్రమాలకు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ సర్కారు నిర్వహించిన మెగా డీఎస్సీలో అవకతవకలు, అక్రమాలకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం గుంటూరు నగరంలో విద్యార్థులు, నిరుద్యోగులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. లక్ష్మీపురం నుంచి లాడ్జి సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు ప్రదర్శనగా వచ్చారు. పార్టీ నేతలు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించారు. డీఎస్సీ నిర్వహణలో టీడీపీ సర్కారు, మంత్రి నారా లోకేష్ విఫలమయ్యారని ఆరోపించారు.
స్పోర్ట్స్ కోటాలో అక్రమంగా ఉద్యోగాలు
వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ పేరుతో నిర్వహించిన 16 వేల పోస్టుల భర్తీలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. ఫలితంగా మెగా డీఎస్సీ కాస్త దగా డీఎస్సీగా మారిందని మండిపడ్డారు. కృష్ణాజిల్లాకు చెందిన నవీన్‌కు మొదటి ర్యాంకు వచ్చినా ఉద్యోగం ఇవ్వకపోవడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. క్రీడల్లో ప్రావీణ్యం లేనివారికి, అసలు క్రీడల్లో పాల్గొనని 421 మంది అభ్యర్థులకు స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు విక్రయించారని ఆరోపించారు. చివరికి ఉద్యోగాలు అమ్ముకునే స్థాయికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిగజారిపోయారని విమర్శించారు. లవ్ క్యాష్ (లోకేష్) రాజాకు సిగ్గుంటే రాజీనామా చేయాలన్నారు.
ఏ రాష్ట్రంలోనూ లేని స్థాయిలో అక్రమాలు
ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ పోస్టులను అమ్ముకున్న అనాలోచిత, దౌర్భాగ్య ప్రభుత్వాన్ని ఇంత వరకు చూడలేదన్నారు. ఓవైపు విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిన చంద్రబాబు ప్రభుత్వం, మరోవైపు డీఎస్సీ నిర్వహణను సైతం పారదర్శకంగా నిర్వహించలేదని ఆరోపించారు. నిజాయతీగానే డీఎస్సీ నిర్వహిస్తే అసలు మెరిట్ లిస్టులను దాచాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. టాపర్ వివరాలను సైట్ నుంచి ఎందుకు తొలగించాల్సి వచ్చిందని నిలదీశారు. కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికై న వారి జాబితాలు పెట్టకుండా కేవలం సెలెక్ట్ అయిన వారికి నేరుగా మెసేజ్‌లు పంపడంపై నిలదీశారు. దీనిపై సీబీఐతో విచారణ చేయిస్తే నిజాలు బట్టబయలు అవుతాయని అన్నారు. అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన రాజీ లేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
అధికారుల బాధ్యతారాహిత్యం
ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయని సాక్ష్యాధారాలతో సహా వైఎస్సార్ సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా తాము విద్యాశాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆ సమయంలో కమిషనర్ వ్యవహరించిన తీరు బాధాకరమని అన్నారు. వారు ప్రభుత్వ అధికారుల్లా కాకుండా రాజకీయ నాయకుల్లా మాట్లాడారని మండిపడ్డారు.
ధర్నాలో వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్, పార్టీ నేతలు షేక్ మస్తాన్‌వలీ, బందా రవీంద్రనాథ్, బత్తుల దేవానంద్, నూనె ఉమామహేశ్వరరెడ్డి, గెడ్డేటి సురేంద్ర, షేక్ షరీఫ్, మాజీ కార్పొరేటర్లు ఈచంపాటి వెంకటకష్ణ (ఆచారి), షేక్ రోషన్, అచ్చాల వెంకటరెడ్డి, పడాల సుబ్బారెడ్డి, అంబేడ్కర్, వంశీ, గేదెల రమేష్, బోడపాటి కిషోర్, గురవయ్య, వైఎస్సార్ విద్యార్థి విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు విఠల్, గంటి, జిల్లా అధ్యక్షుడు వినోద్, ఉపాధ్యక్షుడు అజయ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు కరీం, కిరణ్, రాజేష్, ఆర్కే, మస్తాన్, సాజిద్, నగర అధ్యక్షుడు గుడిశెట్టి రవీంద్ర, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బాజీ, జిల్లా కార్యదర్శులు సతీష్ యాదవ్, బంకా అరుణ్, మంగళగిరి, తెనాలి అధ్యక్షులు సందీప్, శామ్యూల్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు భాను, గన్నవరం అధ్యక్షుడు చైతన్య, సాయి, హోసన్నా, శ్రీనివాసరెడ్డి, బాషా, ఆలా కిరణ్, కోటి తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట నాయకుల నిరసన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందిస్తున్న ముఖ్య నేతలు


