సర్కారు మాటల్లోనే లైబ్రరీలు | - | Sakshi
Sakshi News home page

సర్కారు మాటల్లోనే లైబ్రరీలు

May 30 2026 2:50 AM | Updated on May 30 2026 2:50 AM

● చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకంతో గ్రంథాలయాలు నిర్వీర్యం ● రూ.కోట్లలో పేరుకుపోయిన స్థానిక సంస్థల సెస్‌ బకాయిలు ● రెండేళ్లుగా నిర్వహణకు పైసా కూడా విదల్చని టీడీపీ ప్రభుత్వం ● ఖాళీల భర్తీపై కనీసం దృష్టి సారించని పాలకులు

గుంటూరు ఎడ్యుకేషన్‌: టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య కాలంలో నిర్వీర్యమైపోయిన గ్రంథాయాలకు తర్వాత వచ్చిన వైఎస్సార్‌ సీపీ సర్కారు పునర్వైభవం తెచ్చే దిశగా సాగింది. ఆనాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తగిన చర్యలు చేపట్టారు. గుంటూరు నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని నాడు–నేడు ద్వారా ఆధునికీకరించి, మౌలిక వసతులు కల్పించారు. వైఎస్‌ జగన్‌ పుణ్యమాని ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏటా వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ కృషి ఫలితంగానే 2024–25 సంవత్సరంలో రూ.16.05 కోట్ల మేరకు సెస్‌ బకాయిలు వసూలు అయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత సెస్‌ బకాయిలు విడుదలకు నోచుకోలేదు. అదే విధంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు నిరుద్యోగ ఉద్యోగార్థులు గ్రంథాలయాలపైనే ఆధారపడుతున్నారు. కాలానుగుణంగా రిఫరెన్స్‌ పుస్తకాలను అందుబాటులో ఉంచకపోవడంతో పేద, మధ్య తరగతి వర్గాల అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు.

తప్పుడు హామీలు

గ్రంథాయాల నిర్వహణకు నిధులు ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం... డిజిటల్‌ గ్రంథాయాలను తెస్తామని ఊదరగొడుతోంది. రాజధానిలో ఆధునిక గ్రంథాలయాన్ని నిర్మిస్తామని కాలం గడుపుతోంది. ప్రతి నియోజకవర్గంలో డిజిటల్‌ గ్రంథాలయం అని సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ అడ్డగోలు హామీ ఇవ్వడం మినహా ఒక్క అడుగు సైతం ముందుకు పడటం లేదు. గుంటూరులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంతోపాటు ఉమ్మడి గుంటూరు జిల్లాలో 97 శాఖ, 41 గ్రామీణ గ్రంథాలయాలు ఉన్నాయి. మరో 106 పుస్తక పంపిణీ కేంద్రాలున్నాయి. 71 శాఖ గ్రంథాలయాలు సొంత భవనాల్లో కొనసాగుతుండగా, 15 అద్దె, ఇంకో 12 అద్దె మినహాయింపులతో నడుస్తున్నాయి. ఆయా గ్రంథాలయాలకు ప్రభుత్వం మంజూరు చేసిన 205 పోస్టుల్లో ప్రస్తుతం 115 మంది పని చేస్తున్నారు. 90 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

విజ్ఞాన భాండాగారాలు ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిర్వీర్యం అవుతున్నాయి. సమాజానికి పుస్తక పఠనాన్ని నేర్పిన గ్రంథాలయాలు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి. గ్రంథాలయాల అభివృద్ధికి పైసా నిధులు కేటాయించడం లేదు. పైగా ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నుల్లో సెస్‌ రూపంలో గ్రంథాలయాలకు చెల్లించాల్సిన వాటాను ఎగ్గొట్టారు.

ఇప్పుడు నియోజకవర్గానికి ఒక డిజిటల్‌ గ్రంథాలయం ఏర్పాటు చేస్తామని మాటల్లోనే ప్రభుత్వం కోటలు కడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement