జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ కుర్చీ కోసం పోటీ | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ కుర్చీ కోసం పోటీ

May 30 2026 2:50 AM | Updated on May 30 2026 2:50 AM

రేపు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ యశస్వి రమణ ఉద్యోగ విరమణ పోటీ పడుతున్న ఆరుగురు సీనియర్‌ వైద్యులు నిబంధనల ప్రకారం నేటి సాయంత్రమే ఆదేశాలకు గడువు

గుంటూరు మెడికల్‌: రెండు తెలుగు రాష్ట్రాల్లో పేదల పెద్దాసుపత్రిగా పేరు గడించిన గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ కుర్చీ కోసం ఆరుగురు సీనియర్‌ వైద్యులు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ యశస్వి రమణ ఆదివారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈనెల 31 ఆదివారం కావటంతో శనివారం సాయంత్రానికల్లా సూపరింటెండెంట్‌గా ఎవరిని నియమిస్తున్నారో ప్రభుత్వం, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయం అధికారులు ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. 24 గంటల గడువు మాత్రమే ఉండటంతో సూపరింటెండెంట్‌ సీటు ఎవరిని వరిస్తుందోనని వైద్యులు, వైద్య సిబ్బంది అంతటా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కుర్చీ కోసం ఆరుగురు సీనియర్‌ వైద్యులు పోటీ పడుతున్నారు. జూన్‌ నెల 1 నుంచి కొత్త సూపరింటెండెంట్‌ విధులు చేపడతారు.

ముగ్గురు చొప్పున పురుషులు, మహిళలు

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ కుర్చీ కోసం ఈసారి ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు పోటీ పడుతుండడం ఆసుపత్రి వర్గాలలో చర్చాంశనీయంగా మారింది. ప్రస్తుతం గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ఎన్‌.వి.సుందరాచారి రేసులో ఉన్నట్లు సమాచారం. న్యూరో సర్జరీ విభాగాధిపతిగా పనిచేస్తున్న డాక్టర్‌ సత్యనారాయణమూర్తి డీపీసీ సీనియార్టీ జాబితాలో నాల్గవ పేరులో ఉన్నారు. సూపరింటెండెంట్‌ రేసులో ఈయన కూడా ఉన్నారు. ఈఎన్‌టీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఉప్పాల శ్రీనివాస్‌, గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్‌ అనుమల కవిత, మానసిక విభాగాధిపతి డాక్టర్‌ నీలి ఉమాజ్యోతి, గతంలో గుంటూరు జీజీహెచ్‌ సర్జరీ విభాగాధిపతిగా పనిచేసి, ప్రస్తుతం విజయవాడ జీజీహెచ్‌ జనరల్‌ సర్జరీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ పద్మశ్రీలు సూపరింటెండెంట్‌ పదవి ఆశిస్తున్న వారిలో ఉన్నారు. మూడు రోజుల కిందట వరకు విజయవాడ జీజీహెచ్‌, మెడికల్‌ కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆలపాటి ఏడుకొండలరావు (ఏవైరావు) ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ రఘునందన్‌ను నియమించింది. విజయవాడ తరహాలో గుంటూరు జీజీహెచ్‌కు, వైద్య కళాశాలకు ఒక్కరినే నియమించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న డాక్టర్‌ సుందరాచారికి సూపరింటెండెంట్‌ పదవి కూడా దక్కే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. డాక్టర్‌ ఉమాజ్యోతి గతంలో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. కొన్ని రోజులపాటు ఇన్‌చార్జి సూరింటెండెంట్‌గా విధులు నిర్వర్తించారు. గతంలో పనిచేసిన అనుభవంతోపాటు, ఎన్నారై మద్దతు ఉండటంతో సూపరింటెండెంట్‌ సీటు దక్కే అవకాశాలు ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. డాక్టర్‌ ఉప్పాల శ్రీనివాస్‌ ఆసుపత్రి డెప్యూటీ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈయనకు ఓ మంత్రి అండదండలు ఉన్నాయని, సూపరింటెండెంట్‌ సీటు వస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డాక్టర్‌ కవిత భర్త డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి టీడీపీ కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజకీయ అండదండలు ఉండటం వల్ల డాక్టర్‌ కవితకు సూపరింటెండెంట్‌ పదవి ఇస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. డీపీసీ సీనియార్టీ జాబితాలో ముందు వరుసలో డాక్టర్‌ సత్యనారాయణమూర్తి పేరు ఉండటంతో ఈయనకు సూపరింటెండెంట్‌ పదవి రావచ్చనే భావిస్తున్నారు. డాక్టర్‌ పద్మశ్రీ నెల్లూరులో పనిచేసిన పరిపాలనా అనుభవంతో విజయవాడ సూపరింటెండెంట్‌గా ప్రయత్నించి అక్కడ విఫలమవడంతో ఇప్పుడైనా ఇవ్వాలంటూ తన పలుకుబడి ఉపయోగిస్తున్నట్లు సమాచారం. సూపరింటెండెంట్‌ పదవి ఎవరిని వరిస్తుందో శనివారం సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement