వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో సమావేశం
తాడికొండ: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమని గుంటూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు మల్లికార్జునపేట 5వ లైన్‌లోని పార్టీ తాడికొండ నియోజకవర్గ కార్యాలయం వేదికగా ఎమ్మెల్సీలు, గుంటూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల సమన్వయకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు అండగా ఉండి ప్రతి ఒక్కరినీ గెలిపించి తీరాలనే లక్ష్యంతో పనిచేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ వైఫల్యాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయానికి బాటలు వేయనున్నాయని, అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి బూత్ ఏజెంట్ల ఎంపిక, ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ అన్ని అంశాలపై పట్టున్న నాయకులు, కార్యకర్తలను గుర్తించి, బలపరచాలన్నారు. టీడీపీ ప్రభుత్వానికి మేకపోతు గాంభీర్యం తప్ప ఎన్నికల్లో పోటీచేసి గెలిచే సత్తా లేదన్నారు. తొలుత మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమాంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మురుగుడు హనుమంతరావు, చంద్రగిరి ఏసురత్నం, గుంటూరు పార్లమెంటు జిల్లా పరిశీలకులు పోతిన మహేష్, నియోజకవర్గాల సమన్వయకర్తలు వనమా బాల వజ్రబాబు, నూరి ఫాతిమా, అంబటి మురళీకృష్ణ, దొంతిరెడ్డి వేమారెడ్డి, అన్నాబత్తుని శివకుమార్, బలసాని కిరణ్‌కుమార్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


