గుంటూరు ఎడ్యుకేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాకు చెందిన పలువురిని పార్టీలో వివిధ హోదాల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఓప్రకటన విడుదల చేసింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పార్టీ అనుబంధ విభాగాల్లో పలువురికి స్థానం కల్పించారు. గుంటూరు జిల్లా మహిళా విభాగ ప్రధాన కార్యదర్శిగా రఘుమహతి వరలక్ష్మీదేవి, జిల్లా మహిళా విభాగ కార్య నిర్వాహక సభ్యురాలిగా తమ్మా శివపార్వతి, జిల్లా మైనార్టీ విభాగ కార్యదర్శిగా మసూద్ ఖాన్ మొహ్మద్, గుంటూరు పశ్చిమ వలంటీర్స్ విభాగ అధ్యక్షుడిగా షేక్ ఆజాద్ (మున్నా), గుంటూరు పశ్చిమ నియోజకవర్గ గ్రీవెన్స్ అధ్యక్షుడిగా అగినం వెంకటేశ్వర్లు (ఏవీరావు), గుంటూరు పశ్చిమ నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ విభాగ అధ్యక్షుడిగా గర్నెపూడి సందీప్ (ఆర్నాల్డ్), గుంటూరు నగర మహిళా విభాగ కార్యదర్శిగా యెనుముల అరుణ
నియమితులయ్యారు.
నగరంపాలెం:జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో గురువారం దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు 103వ జయంతి నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ చిత్రపటానికి పలువురు పోలీస్ అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజానికి ఎన్టీఆర్ చేసిన సేవలను, ఆయన క్రమశిక్షణను జిల్లా ఏఎస్పీ (పరిపాలన) రమణమూర్తి గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో ఏఆర్ ఆర్‌ఐ శ్రీహరిరెడ్డి, ఆర్‌ఎస్‌ఐలు టి.బాలశంకర్‌రావు, సుబ్బారెడ్డి, రాజారత్నం, ఎం.ఎల్.ప్రసాద్, పిఆర్‌ఓ శ్రీనివాసరావు పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
విశ్రాంత పోలీస్ అధికారుల
సంఘం ఆధ్వర్యంలో..
తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత నందమూరి తారక రామారావు అని విశ్రాంత పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాళహస్తి సత్యనారాయణ అన్నారు. ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో భాగంగా గురువారం ఎన్టీఆర్ స్టేడియంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1977లో నెల్లూరు జిల్లా ఇందుకురిపేట పీఎస్ పరిధిలో యమగోల చిత్రం షూటింగ్ జరగ్గా, ఎన్టీఆర్‌కు భద్రత కల్పిస్తూ దాదాపు పది రోజులు అక్కడే విధులు చేపట్టానని గుర్తు చేసుకున్నారు.
తాడేపల్లి రూరల్: ఆర్యవైశ్యులపై పంచ్ ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు దేవతి భగవన్నారాయణ డిమాండ్ చేశారు. గురువారం మంగళగిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యులు వ్యాపారాలు చేసుకోవాలే కానీ వారికి రాజకీయాలు ఎందుకు అంటూ పంచ్ ప్రభాకర్ వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. తమ నాయకుడు టీజీ వెంకటేష్‌పైనా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఆర్యవైశ్యులు కుల మతాలకతీతంగా సేవ చేస్తుంటే వారికి రాజకీయాలు అంటగట్టడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యులను కించపరిచిన పంచ్ ప్రభాకర్‌ను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు. భారతదేశంలో మత ఘర్షణలు తెచ్చేలా మాట్లాడిన ప్రభాకర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గుంటూరు జిల్లా అధ్యక్షులు చుండూరు ఉమామహేశ్వరరావు, ఫ్యాన్సీ మర్చంట్స్ అసోసియేషన్ సెక్రటరి పువ్వాడ సతీష్, రచ్చబండ గౌరవాధ్యక్షులు నేరెళ్ల మురళీకృష్ణ, అధ్యక్షులు సిహెచ్ వాసు, సెక్రటరీ మాజేటి సత్యబాలాజీ, భోజనపల్లి తాండవ, గార్లపాటి శ్రీనివాసరావు, ఆర్యవైశ్య పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
శావల్యాపురం: తాగునీటి అవసరాల నిమిత్తం సాగర్ జలాలు విడుదల చేస్తున్నట్లు లింగగుంట్ల ఎన్నెస్పీ ఈఈ డివి సుబ్బారావు గురువారం తెలిపారు. ఈఈ సుబ్బారావు మాట్లాడుతూ ఈనెల 30న శావల్యాపురం మండలం గంటావారిపాలెం గ్రామ సమీపాన ఉన్న అద్దంకి బ్రాంచ్ కెనాల్‌కు 1000 క్యూసెక్కుల సాగర్ జలాలు తాగునీరు అవసరాల కోసం విడుదల అవుతాయన్నారు. పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల పరిధిలోని మంచినీరు చెరువులు, వాగులు, కుంటలు నింపుకునేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం మాచర్ల పరిధిలో బొగ్గువాగు నింపుతున్నట్లు తెలిపారు. చెరువులను అధికారులు పర్యవేక్షించాలని చెప్పారు.


