ఇంటర్ విద్యార్థులకు ఉపకారవేతనాలు గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ విద్యార్థులకు విద్యాదాన్ పథకం ద్వారా ఉపకార వేతనాలు అందుకునేందుకు అవకాశాలున్నాయి. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇది ఆసరాగా నిలుస్తోంది. సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ అందించే ఉపకార వేతనానికి 10వ తరగతి ఉత్తీర్ణులై, ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులు. కోర్సు, కాలపరిమితి ఆధారంగా ఇంటర్‌లో ఏడాదికి రూ.10 వేలు, విద్యార్థి ప్రతిభను పరిగణనలోకి తీసుకుని ఉన్నత విద్యకు రూ.75 వేలు ఉపకారవేతనం రూపంలో అందిస్తారు. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ అనంతరం విద్యార్థులను ఎంపిక చేస్తారు. జూన్ 20లోపు నేరుగా విద్యాదాన్.ఆంధ్ర వెబ్‌సైట్‌తో పాటు విద్యాదాన్ యాప్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 5న స్క్రీనింగ్ టెస్టు నిర్వహిస్తారు. టెన్త్‌లో కనీసం 90 శాతం మార్కులు సాధించి కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షల లోపు ఉన్నవారు అర్హులు. ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. ఉదయం 9 – సాయంత్రం 6 గంటలలోపు నంబరు 96635 17181లో సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.
కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి సమస్య పరిష్కరించుకోండి తెనాలి వన్ టౌన్ ఎస్‌ఐ సస్పెన్షన్ తెనాలి రూరల్: తెనాలి వన్ టౌన్ ఎస్‌ఐ గడ్డం అబ్రహాం సస్పెండ్ అయ్యారు. మహిళ ఆత్మహత్య విషయంలో ఆయనపై ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి చర్యలు తీసుకున్నారు. బంగారం రికవరీ పేరిట పోలీసులు వేధిస్తున్నారంటూ పట్టణానికి చెందిన కటారి తిరుపతమ్మ ఈ నెల 23వ తేదీన ఆత్మహత్యాయత్నం చేయడం, మరుసటి రోజు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఎస్‌ఐ అబ్రహాంను బాధ్యుడిగా పేర్కొంటూ ఐజీ సస్పెన్షన్ వేటు వేశారు.
అమరావతి: వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలతో విద్యుత్ సరఫరాలో ఉత్పన్నమయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం రాయపూడి సీఆర్‌డీఏ విద్యుత్ ప్రాంగణంలో కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశామని సీఆర్‌డీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చిరుమామిళ్ల వెంకటేశ్వరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 24 గంటలు పని చేసే విధంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. క్యాపిటల్ డివిజన్ పరిధిలోని తుళ్లూరు, తాడికొండ, అమరావతి, పెదకూరపాడు మండలాల వినియోగదారులు 1912 టోల్‌ప్రీ నంబర్‌కుగాని 9490615518 నంబరుగాని ఫోన్‌చేసి సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలని కోరారు.
శాంతియుత వాతావరణంలో బక్రీద్ నిర్వహించాలి
నగరంపాలెం: బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వర్తించుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. త్యాగానికి, సహనానికి ప్రతీకగా నిలిచే బక్రీద్‌ను శాంతి, సామరస్య వాతావరణంలో చేసుకోవాలని అన్నారు. జిల్లాలోని ప్రధాన మసీదులు, మదరసాలు, ఈద్గాల వద్ద ప్రత్యేక బందోబస్త్ కొనసాగుతుందని అన్నారు. సున్నితమైన ప్రాంతాలపై నిఘా ఉంటుందని అన్నారు. సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక దృష్టిసారించామని చెప్పారు. ప్రార్థనా స్థలాలు, రద్దీ కూడళ్లల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ వివరించారు.