దౌర్జన్యం చేసిన పోలీసులపై ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

దౌర్జన్యం చేసిన పోలీసులపై ఫిర్యాదు

May 28 2026 1:46 AM | Updated on May 28 2026 1:46 AM

దౌర్జన్యం చేసిన పోలీసులపై ఫిర్యాదు

వైఎస్సార్‌ సీపీ రేపల్లె సమన్వయకర్త పీట నాగమోహన కృష్ణ

పొన్నూరు: మండలంలోని మామిళ్లపల్లి గ్రామ మొక్కజొన్న రైతులు, వైఎస్సార్‌ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణను పరామర్శించేందుకు వెళుతున్న సమయంలో దౌర్జన్యం చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని రేపల్లె సమన్వయకర్త పీట నాగమోహన కృష్ణ బుధవారం పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈనెల 23వ తేదీన మామిళ్లపల్లి గ్రామానికి వస్తున్న సమయంలో తొట్టెంపూడి గ్రామ సమీపంలో పొన్నూరు రూరల్‌ ఎస్‌ఐ వి.శ్రీహరి, సీఐ పి.కృష్ణయ్య దౌర్జన్యంగా వ్యవహరించారన్నారు. సీఐ దురుసుగా ప్రవర్తించి పోలీసు జీపులోకి వస్తువును పడేసినట్లుగా నెట్టి, మెడపై మోచేతితో పొడిచి ఇబ్బంది పెట్టారని చెప్పారు. బలవంతంగా చేబ్రోలు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లి దుర్భాషలాడుతూ గంటన్నర పాటు పోలీస్‌ స్టేషన్లో బంధించారని వివరించారు. మళ్లీ బలవంతంగా అక్కడి నుంచి పొన్నూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించి అక్రమంగా అరెస్ట్‌ చేసి నిర్బంధించారని పేర్కొన్నారు. అక్రమ నిర్బంధాన్ని ప్రశ్నించిన వైఎస్సార్‌ సీపీ వేమూరు సమన్వయకర్త వరికూటి అశోక్‌ బాబుతో పాటు నాయకులపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా మళ్లీ పోలీసు స్టేషన్లో కూడా తనతో దౌర్జన్యంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమంగా నిర్బంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో వరికూటి అశోక్‌ బాబు, పార్టీ నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement