తెగించిన తమ్ముళ్లు | - | Sakshi
Sakshi News home page

తెగించిన తమ్ముళ్లు

May 27 2026 6:20 AM | Updated on May 27 2026 6:20 AM

గూండాల్లా వ్యవహరిస్తున్న టీడీపీ కాంట్రాక్టర్లు జీఎంసీలో అద్దాలు పగలగొట్టిన టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కమిషనర్‌ చాంబర్‌లో కూడా సిబ్బందిపై అదే దురుసుతనం పోలీసు కేసు పెట్టాలని జీఎంసీ కమిషనర్‌ ఆదేశం గతంలోనూ ఎస్‌ఈపై దౌర్జన్యానికి దిగినా నిందితుడిపై చర్యలు శూన్యం అధికారులంటే చులకనగా చూస్తున్న టీడీపీ శ్రేణులు అక్రమార్జనకు అడ్డు తగిలితే దాడులకూ వెనుకాడని వైనం

ప్రభుత్వ ఉద్యోగులంటే అలుసే

అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లింపుల ప్రక్రియ అంతా కూడా నిధి పోర్టల్‌ ద్వారా జరుగుతుంది. బిల్లులను నిధి పోర్టల్‌లో పెట్టే క్రమంలో టీడీపీకి చెందిన కాంట్రాక్టర్లు ఏకంగా ఇంజినీరింగ్‌ అధికారులపై దురుసుగా వ్యవహరించారు. పరుష పదజాలంతో దూషించారు.

పలకలూరు రోడ్డు నుంచి తురకపాలెం వెళ్లే రోడ్డులో నగరపాలక సంస్థకి చెందిన చెరువులో వ్యర్థాలు, బిల్డింగ్‌ మెటీరియల్‌ వేయవద్దని చెప్పిన శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై మేయర్‌ పక్కన తిరిగే ఓ కాంట్రాక్టర్‌ దూషణలకు దిగారు.

తాజాగా అభివృద్ధి పనులను తనిఖీ చేసే థర్డ్‌ పార్టీ క్వాలిటీ కంట్రోలర్‌పై ఇదే మేయర్‌ పక్కనే తిరిగే కాంట్రాక్టర్‌ దురుసుగా వ్యవహరించాడు. ఆయన్ను భయపెట్టి ప్రయత్నం చేయడంతో భయపడాల్సిన పరిస్థితులు కార్పొరేషన్‌లో చర్చనీయాంశంగా మారింది. బిల్లు చెల్లింపు సక్రమంగా చేయడం లేదని ఈఈపై పరుషపదజాలంతో దూషించడంతో ఆయన చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు. ఇప్పటికై నా కార్పొరేషన్‌ అధికారులు సీరియస్‌గా తీసుకుంటారా.. లేదంటే అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి మౌనంగా ఉంటారా.. వేచి చూడాల్సిందే.

సాక్షి ప్రతినిధి, గుంటూరు: మొన్న కొల్లూరులో ఏకంగా పోలీసుస్టేషన్‌పై తెలుగు తమ్ముళ్లు దాడి చేస్తే, నేడు గుంటూరులో ఏకంగా ఐఏఎస్‌ అధికారిపై దాడికి దిగడానికి కూడా వెనుకాడలేదు. అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్‌ ఏకంగా మున్సిపల్‌ కమిషనర్‌ మయూర్‌ అశోక్‌ చాంబర్‌లోకి చొచ్చుకుపోవడానికి సిద్ధం కావడం తెలుగుదేశం తమ్ముళ్లు ఏ స్థాయికి దిగజారుతున్నారో అర్థం అవుతోంది. అధికార పార్టీకి చెందిన వారు నగరపాలక సంస్థలో రెచ్చిపోతున్నారు. తాము చెప్పింది చేయకపోతే నానా వీరంగమే సృష్టిస్తున్నారు. అందుకు నిదర్శనం సోమవారం సాయంత్రం టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపాటి అమృతరావు కార్పొరేషన్‌ కార్యాలయంలో అద్దాలు పగలగొట్టడం, కమిషనర్‌ చాంబర్‌లో సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించిన ఘటనలు.

నగర కమిషనర్‌ మయూర్‌ అశోక్‌ స్పందించి లాలాపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించినా ఇప్పటికీ విచారణ పేరుతో పోలీసులు అమృతరావుని అరెస్టు చేయలేదు. పైగా మంగళవారం ప్రెస్‌మీట్‌ పెట్టి మున్సిపల్‌ కమిషనర్‌పై ఆరోపణలు చేశారు.

ఇదీ అసలు సంగతి...

టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దొంగ టెండర్లు వేయడంతోపాటు లెస్‌ టెండర్లు గోల్‌మాల్‌ వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. సుమారు 70 మందిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్లు గతంలో దక్కించుకున్న వర్కులను రద్దు చేసి తిరిగి రీ టెండర్‌ పిలిచారు. సదరు జాబితాలో టీడీపీ నాయకుడు రాయపాటి అమృతరావు కూడా ఉన్నారు. ‘నేను అసలు వర్కే చేయలేదు, నా పేరు ఎలా బ్లాక్‌ లిస్ట్‌లో పెడతారంటూ’ ఇంజినీరింగ్‌ అధికారులపై దౌర్జన్యం చేశాడు. దీంతో ఆగకుండా పది మంది కుర్రాళ్లను తీసుకువచ్చి కార్పొరేషన్‌లో తన పొగరు చూపించేందుకు కార్యాలయంలోని అద్దాలు పగలగొట్టాడు. దీంతో ఆగకుండా కమిషనర్‌ అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నించాడు. అప్పుడే ప్రభుత్వ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ జరుగుతుందని, ఇప్పుడు వెళ్లడానికి కమిషనర్‌ వద్దకు కుదరని చెప్పడంతో అమృతరావు ఊగిపోతూ సిబ్బందిపై కూడా దురుసుగా ప్రవర్తించాడు. సీరియస్‌ అయిన కమిషనర్‌ మయూర్‌ అశోక్‌ కార్యాలయ మేనేజర్‌ను పిలిపించి లాలాపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసి మంగళవారం కార్యాలయంలో విచారణ చేపట్టారు.

ఎన్ని కేసులున్నా లెక్కేలేదు...

ఇదే రాయపాటి అమృతరావు బిల్లుల చెల్లింపుల విషయంపై గత కొద్ది నెలల క్రితం నగర పాలక సంస్థ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ను పరుష పదజాలంతో దూషించాడు. దీంతో అక్కడే ఉన్న మాజీ మేయర్‌ సర్ది చెప్పి పంపించి వేశారు. సదరు సంఘటనపై కార్పొరేషన్‌ ఉద్యోగులంతా నిరసన కార్యక్రమం కూడా నిర్వహించారు. కమిషనర్‌ను కలిసి అతనిపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం కూడా అందజేశారు. ఇదే కాంట్రాక్టర్‌పై వినాయకచవితి పూజ విషయంలో గొడవ జరగడంతో వేమూరి సురేష్‌బాబు అనే వ్యక్తి పట్టాభిపురం పోలీసుస్టేషన్‌లో కేసు పెట్టారు. దీంతోపాటు మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి పెట్రోల్‌ పోసి తగలబెట్టిన ఘటనలో అమృతరావు కీలకంగా వ్యవహరించాడు.

నేలపై పడిన అద్దాల ముక్కలు

కాంట్రాక్టర్లం అని చెప్పుకొనే టీడీపీ గూండాలు గతంలో నగరపాలక సంస్థ అధికారులపై కూడా దురుసుగా వ్యవహరించి వార్తల్లోకెక్కినప్పటికీ వారిపై ఇంత వరకు ఎటువంటి చర్యలు లేవు.

Advertisement
 
Advertisement
Advertisement