అర్హులైన పౌరుల ఓటు హక్కు తొలగిస్తే సహించబోం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ బూత్ లెవల్ ఏజెంట్లతో సమావేశం
గుంటూరు ఎడ్యుకేషన్ :టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొందని, గత ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన విప్లవాత్మకమైన సంక్షేమ కార్యక్రమాలు తిరిగి 2029లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని చేకూర్చుతాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు అన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్ – సర్) కార్యక్రమంలో టీడీపీ ప్రోద్బలంతో అర్హులైన వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించాలని చూస్తే సహించబోమని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం హౌసింగ్‌బోర్డు కాలనీలోని మామిడి గార్డెన్స్‌లో పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ బూత్ లెవల్ ఏజెంట్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ... కేంద్ర ఎన్నికల సంఘం చేపతున్న ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ఏజెంట్లు ఎంతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని 291 పోలింగ్ బూత్‌లలో పార్టీ బీఎల్‌ఏలు సమర్థంగా వ్యవహరించి, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు జాబితాలో ఉండేలా చూడాలన్నారు. దొంగ ఓట్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వరాదని స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును అర్హులైన ప్రతి పౌరుడు పొందాలన్నారు. అర్హులైన పౌరుల ఓటు హక్కు తొలగించేందుకు ఏ ఒక్కరికీ అధికారం లేదని, ఆ విధంగా జరిగితే న్యాయ పోరాటానికి దిగుతామని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్న దృష్ట్యా మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయ బావుటా ఎగురవేస్తుందని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనూ తమ విజయం ఖాయమని చెప్పారు.
బీఎల్‌ఏలు సైనికులుగా పని చేయాలి
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ పార్లమెంటు జిల్లా పరిశీలకుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఐర్‌లో అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండేలా బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అక్రమాలను ఎండగట్టి, వైఎస్సార్ సీపీ విజయమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. విద్యావంతులు, మేధావులకు నిలయమైన పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు శ్రమించాలని సూచించారు.
అప్రమత్తత అవసరం
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 24 ఏళ్ల తరువాత చేపడుతున్న ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండే విధంగా బీఏల్‌ఏలు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. ఇంటింటికీ వచ్చే బీఎల్‌వోలు వివిధ కారణాలను చూపి, ఓటు హక్కును రద్దు చేసేందుకు ప్రయత్నిస్తారని, బీఎల్‌ఏలు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వైఎస్సార్ సీపీ మద్దతుదారుల పేరుతో ఓట్లు తొలగించేందుకు కుట్రలు చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు.
ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో కీలకం
ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమని, దానిని పరిరక్షించుకునేందుకు ప్రజలు, అర్హులైన ఓటర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.
వైఎస్సార్ సీపీ ఓట్లు తొలగింపునకు కుట్రలు
వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌లో వైఎస్సార్‌సీపీ వారి ఓట్లు తొలగించేందుకు టీడీపీ చేసే కుట్రలను ధైర్యంగా ఎదురించాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపోటములు బీఎల్‌ఏలపైనే ఆధారపడి ఉన్నాయనే విషయాన్ని మరువరాదన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ పారదర్శకంగా సాగాలని పేర్కొన్నారు. ఎస్‌ఐఆర్ చేపట్టిన అనంతరం ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఫలితాలను చూస్తే, దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. బీఎల్‌ఏలు సమర్థంగా వ్యవహరించి పార్టీ మద్దతుదారుల ఓట్లు తొలగించకుండా అడ్డుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐర్ ప్రక్రియపై బీఎల్‌ఏలకు గుంటూరు పార్లమెంటు పరిశీలకుడు పోతిన మహేష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో పార్టీ విద్యార్థి విభాగ అధ్యక్షుడు పానుగంటి చైతన్య, నియోజకవర్గ పరిశీలకులు నిమ్మకాల రాజనారాయణ, నల్లమోతు రూత్‌రాణి, మాజీ కార్పొరేటర్లు, వైఎస్సార్ సీపీ డివిజన్ అధ్యక్షులు, బూత్ లెవల్ ఏజెంట్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


