విత్తన దుకాణంలో విజిలెన్స్‌ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

విత్తన దుకాణంలో విజిలెన్స్‌ తనిఖీలు

May 27 2026 6:20 AM | Updated on May 27 2026 6:20 AM

రూ. 45 లక్షల విలువ చేసే మిర్చి

విత్తనాల అమ్మకాలు నిలిపివేత

ప్రత్తిపాడు: మిర్చి విత్తనాలు విక్రయించే దుకాణంపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. వట్టిచెరుకూరు మండలం కర్నూతల గ్రామంలోని కర్షక్‌ సీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో మంగళవారం రాత్రి స్థానిక ఏవో సునీతతో కలిసి గుంటూరు విజిలెన్స్‌ సీఐ కె.చంద్రశేఖర్‌, ఎస్‌ఐ లక్ష్మీ మాధవిలు తనిఖీలు చేశారు. రికార్డులు, స్టాక్‌ రిజిస్టర్లు పరిశీలించారు. రికార్డులు సక్రమంగా లేకపోవడం, సరైన పత్రాలు చూపించక పోవడంతో సుమారు రూ.45 లక్షల విలువ చేసే మిర్చి సూపర్‌– 10 రకం విత్తనాల అమ్మకాలను నిలుపుదల చేసినట్లు ఏవో తెలిపారు. విత్తనాల నమూనాలు సేకరించారు.

డీఎంహెచ్‌ఓలో అవినీతిపై చర్యలు తీసుకోవాలి

బాపట్ల: బాపట్ల డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని మాదిగ సంక్షేమ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుజన్‌మాదిగ కోరారు. జిల్లా కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ను మంగళవారం కలసి వినతిపత్రం అందించారు. ఈపురుపాలెం ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఎస్‌ రాధాకృష్ణ ఏప్రిల్‌ 2024 సంవత్సరం నుంచి డిసెంబర్‌ 2025 వరకు విధులకు హాజరుకాకున్నా, ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేయకపోయినా జీతం మంజూరు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకొల్లులో మెడికల్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్న భానుప్రకాష్‌ నెల మొత్తం మీద కేవలం వారం రోజులు కూడా రాడని, వచ్చిన వారం రోజులు కూడా, ఫుల్లుగా మద్యం సేవించి, సిబ్బందిని ఇబ్బంది పెడుతుంటాడని కలెక్టర్‌కు వివరించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో నాయకులు ఆనంద్‌మాదిగ, శ్రీహరి ఉన్నారు.

భార్య మృతికి కారణమైన భర్త అరెస్ట్‌

దాచేపల్లి: భార్య మృతికి కారణమైన భర్తని అరెస్ట్‌ చేసినట్లు సీఐ ఎం.రాజేష్‌ మంగళవారం తెలిపారు. మండలంలోని పెదగార్లపాడుకి చెందిన షేక్‌ జాన్‌బీ కుమార్తె ఆశాని మాచర్ల మండలం కొత్తూరుకి చెందిన షేక్‌ సుభానీకి ఇచ్చి గత 15 ఏళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఒక కుమార్తె సంతానం. ఉపాధి కోసం వీరిద్దరు మండలంలోని గామాలపాడు గ్రామంలో నివాసం ఉంటున్నారు. సుభాని చెడు వ్యసనాలకు లోనై తరచూ భార్య ఆశాని హింసపెడుతున్నాడు. సుభాని మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ, ఆశాని హింసలకు గురి చేయటంతో పాటుగా ఆత్మహాత్య చేసుకునేలా ప్రేరించాడు. దీంతో గత మార్చి నెల 6వ తేదీన ఇంట్లోనే చీరతో ఉరివేసుకుని ఆశా ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో తన కుమార్తె ఆత్మహత్యకు కారణమైన సుభానిపై జాన్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుభానిని అరెస్ట్‌ చేసి కోర్టులో హజరుపరిచామని సీఐ రాజేష్‌ చెప్పారు.

హత్యాయత్నం కేసులో

ఇద్దరికి రిమాండ్‌

ముప్పాళ్ల: ద్విచక్రవాహనంపై వస్తున్న వ్యక్తిని ట్రాక్టర్‌ తో ఢీకొట్టి హత్యాయత్నంపై నమోదైన కేసులో ఇద్దరిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ పి.అనిల్‌కుమార్‌ మంగళవారం తెలిపారు. మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన కత్తి శివారెడ్డి ఈ నెల 23వ తేదీన సత్తెనపల్లి నుంచి ద్విచక్రవాహనం పై వస్తుండగా, అదే గ్రామానికి చెందిన మధిర వీరారెడ్డి అతనికి అల్లుడు వరసైన అన్నపురెడ్డి కోటిరెడ్డిలు పాతకక్షల నేపధ్యంలో బొల్లవరం అడ్డరోడ్డు వద్ద మట్టిలోడు ట్రాక్టర్‌తో ద్విచక్రవాహనం వెనుకగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో శివారెడ్డికి గాయాలు కావటంతో చికిత్స నిమిత్తం నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శివారెడ్డి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసి అందుకు బాధ్యులైన వారిని అరెస్ట్‌ చేసి సత్తెనపల్లి కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌ విఽధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement