రంగంలోకి దిగిన పోలీసులు
రెండేళ్ల కిందట గ్రామం వదిలిన రామారావు అరెస్టు
హత్యాయత్నం కేసులో శిక్ష తప్పదని ముందుగా పథక రచన
వైఎస్సార్ సీపీ నాయకులపై అక్రమ కేసులు
తాడికొండ: తనపై ఉన్న హత్యాయత్నం కేసును రాజీ చేసుకునేందుకు మరో మార్గం లేక సాక్ష్యాలు, ఆధారాలు బలంగా ఉండటంతో ఎక్కడ శిక్ష పడుతుందో అనే భయంతో వైఎస్సార్ సీపీకి చెందిన నాయకులపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేసిన ఘటన తాడికొండ మండల పరిధిలో చోటుచేసుకుంది.
వివరాలు.. ముక్కామల గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త చిన్ని రామారావును 2024 ఎన్నికల ఫలితాల అనంతరం అదే గ్రామానికి చెందిన యార్డు మాజీ చైర్మన్ చిమటా పూర్ణచంద్రరావు మరి కొందరు కలిసి దాడిచేసి కత్తితో పీక కోయడంతో ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్నాడు. అనంతరం ప్రాణ భయంతో గ్రామం వదిలి పెదకాకాని మండలం వెనిగండ్లలో తలదాచుకుంటున్నాడు.
ఆ కేసు తుది దశకు చేరడం సాక్ష్యాలు, ఆధారాలు బలంగా ఉండటంతో ఎక్కడ తనకు శిక్ష పడుతుందోననే భయంతో కుటిల పన్నాగం పన్ని గ్రామంలో నివాసం ఉండని వైఎస్సార్ సీపీకి చెందిన దామనబోయిన వెంకటేశ్వరరావు పుట్టిన రోజును వేదికగా చేసుకున్నాడు. అందులో భాగంగా పక్కా ప్రణాళికను రచించి పుట్టిన రోజు సందర్భంగా చిన్ని రామయ్య బ్యానర్ వేసినట్లు అందులో ‘సప్త సముద్రాల అవతల ఉన్నా పిలిపిస్తాం... ఓటమికి భయం పుట్టిస్తాం’ అనే క్యాప్షన్‌ను పెట్టి ఓ బ్యానర్‌ను సృష్టించి గ్రామంలో కట్టారు. దీనికి రక్తాభిషేకం చేసినట్లు బ్యానర్‌పై రక్తాన్ని చిమ్మి దానిని వైఎస్సార్ సీపీ కార్యకర్త చిన్ని రామారావు కట్టినట్లుగా ఫొటోలు వేసి వివాదాస్పదంగా ఉందంటూ పోలీస్‌స్టేషన్‌లో నేరుగా ఆయనే ఫిర్యాదు చేశాడు.
ఇంకేముంది రంగంలోకి దిగిన పోలీసులు వెనిగండ్లలో ఉన్న చిన్ని రామారావును కౌన్సెలింగ్ ఇచ్చి మొత్తం 26 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. పుట్టిన రోజు చేసుకున్నట్లు బ్యానర్‌లో ఫొటో వేసిన వెంకటేశ్వరరావు గుంటూరులో నివాసం ఉంటుండగా బ్యానర్ కట్టినట్లు ఫిర్యాదు చేసిన చిన్ని రామారావు ఊరు వదిలి వెనిగండ్ల గ్రామంలో ఉంటున్నాడు.
ఈ ఘటనపై బాధితుడు భార్య చిన్ని మాణిక్యమ్మ మాట్లాడుతూ తన భర్త ఇంటి వద్ద పని చేసుకుంటుండగా మధ్యాహ్నం సమయంలో పోలీసులు వచ్చి తీసుకెళ్లారని, అన్నం తిని వస్తానన్నా వినకుండా కారులో ఎక్కించుకొని మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో తీసుకెళ్లి 5.30 గంటలకు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారన్నారు. తనను కూడా మాట్లాడనీయకుండా కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు.
తన భర్తపై హత్యాయత్నం చేసిన చిమటా పూర్ణచంద్రరావు ఆయనే బ్యానర్ కట్టి రాజీ కోసం తమను ఇలా తప్పుడు కేసులతో బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లా పాపలు, గోడ్డు గోదాతో ఊరు వదిలి తలదాచుకున్న మాపై ఇలా కక్ష్య సాధింపు చర్యలకు దిగడం ఎంతవరకు న్యాయమని కన్నీటి పర్యంతమయ్యారు.


