నగరంపాలెం: మొక్కజొన్న రైతుల ప్రజాస్వామ్య ఉద్యమాన్ని అణిచివేసేందుకు రైతులపై అక్రమ కేసులు బనాయించారని వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ధ్వజమెత్తారు. మొక్కజొన్న రైతుల, మహిళలపై అసభ్య ప్రవర్తన, అక్రమ నిర్భంధం, ప్రజాస్వామ్య ఉల్లంఘనలపై సోమవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో అంబటి మురళీకృష్ణ, మహిళా రైతు మమత, రైతులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిల్లా ఏఎస్పీ జీవీ రమణమూర్తికి ఫిర్యాదు పత్రం అందించారు. మామిళ్ళపల్లిలో జరిగిన దాడులపై ఏఎస్పీకి వివరించారు. అనంతరం అంబటి మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ పోలీసుల సహకారంతో టీడీపీ గూండాలు వైఎస్సార్ సీపీ జెండాలు తీసుకువచ్చి, గోడౌన్‌లో ఉంచి.. అవి తనకు చెందిన మొక్కజొన్న అక్రమ నిల్వలు అంటూ సోదాలు చేశారని మండిపడ్డారు. తర్వాత పోలీసులు, రెవెన్యూ అధికారులతో గోడౌన్ వద్దకు వచ్చి తాళాలు పగులకొట్టిన అనంతరం సీజ్ చేశారని ధ్వజమెత్తారు. గోడౌన్ అంబటి మురళీకృష్ణది కాదని రైతులు రెవెన్యూ, పోలీసుల అధికారుల వద్ద మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర సత్యమేవజయతే పేరుతో టీవీలు, పత్రికలు, మాధ్యమాల ద్వారా రైతులు, ఉద్యమ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. అయితే సంబంధిత అధికారుల ద్వారానే ఆ ఆరోపణలు అసత్యమని స్పష్టమైందన్నారు. తహసీల్దార్, రెవెన్యూ అధికారులు చట్టబద్ధ పక్రియ పాటించకుండా మొక్కజొన్న నిల్వ చేసిన గోడౌన్‌ను అక్రమంగా లాక్ చేయించారని విమర్శించారు. పోలీసులు సైతం ఎటువంటి వారెంట్‌లేకుండానే మామిళ్లపల్లిలోని తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని తెలిపారు. అలాగే రైతులకు సంఘీభావం తెలియజేసేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ నాయకుడు జూపూడి ప్రభాకర్‌రావును నిర్భందించారని ఆరోపించారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర, స్థానిక తహసీల్దార్, పొన్నూరు రూరల్ పీఎస్ సీఐ, ఎస్‌ఐ, తెనాలి, చేబ్రోలు పీఎస్‌ల సీఐలపై, నాయకులపై కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేసేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు, రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తనకు పరువు నష్టం కలిగించిన వారిపై దావా వేస్తానన్నారు. మహిళా నాయకురాలు, రైతు మమత మాట్లాడుతూ మొక్కజొన్న నిల్వలను పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్రమంగా, అమానుషంగా సీజ్ చేశారని వాపోయారు. టీడీపీ గూండాలు, ఇతర ఊర్ల నుంచి ఆందోళనకారులను తీసుకొచ్చి గోడౌన్‌ను పగలకొట్టారని ఆరోపించారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల వందలాది మంది పోలీసులతో గోడౌన్‌పై దాడి చేయించారని విమర్శించారు. ఎనిమిది మంది రైతులపై పోలీసులు దాడి చేసి చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు.
జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ
పోలీసు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసిన
అంబటి మురళీకృష్ణ, రైతులు


