చైతన్య గ్రామం.. పేకాట నిలయం | - | Sakshi
Sakshi News home page

చైతన్య గ్రామం.. పేకాట నిలయం

May 26 2026 3:08 AM | Updated on May 26 2026 3:08 AM

యడ్లపల్లిలో జోరుగా పేకాట

ముక్కలు కలుపుతున్న చేయితిరిగిన మొనగాళ్లు రోజూ రూ.లక్షల్లో జూదక్రీడ అటుకేసి చూడని పోలీసులు అధికార పార్టీ నేతలే కీలకం

యడ్లపల్లిలో జోరుగా పేకాట

తెనాలి: బాపట్ల జిల్లా చుండూరు మండల గ్రామం యడ్లపల్లి వ్యవసాయ ప్రధానమైంది... ఇక్కడి రైతులు, ప్రజలు చైతన్యవంతులు. దివంగత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తుఫాన్‌కు పంటనష్టం ఎన్యూమరేషన్‌లో జరిగిన అన్యాయంపై చేసిన పోరాటాన్ని ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. ఫలితంగా అప్పటి సీఎం ఎన్టీఆర్‌ ఆ గ్రామాన్ని ప్రత్యేకంగా సందర్శించారు. సారా ఉద్యమానికి మద్దతుగా, జనావాసంలో మద్యం దుకాణానికి వ్యతిరేకంగా అక్కడి మహిళలు పోరాడారు. అంతటి చైతన్యవంతమైన గ్రామం ఇప్పుడు జూదక్రీడకు నిలయమైంది. రాజకీయ నేతలు, పోలీసుల ఆశీస్సులతో పేకాటకు కేంద్రంగా మారింది. ఎక్కడెక్కడి చేయితిరిగిన మొనగాళ్లు ఇక్కడ రోజూ పేకముక్కలు కలుపుతుంటారు. రూ.లక్షలు చేతులు మారుతుంటాయి. అయినా స్థానికులు మౌనం వహిస్తుండటం చిత్రంగా ఉంది.

కొత్తవారికి ప్రవేశం నిషిద్ధం

యడ్లపల్లిలోని జాతీయ బ్యాంకు దగ్గర్లోని ఓ నివాసంలో ప్రతిరోజూ సాయంత్రం నుంచి జూదక్రీడ ఆరంభిస్తారు. కొన్ని గంటలు సీక్వెన్స్‌ తర్వాత కోతముక్కాటకు దిగుతున్నారు. రెండు, మూడు గంటలు...ఫటాఫట్‌...! విజేతలు, తరాజులు ఎవరో తేలిపోతుంది. ఆరోజుకి ఇక సెలవు. కాదు కూడదనుకుంటే జూదక్రీడ...గ్రామానికి దగ్గర్లోని నిమ్మతోటకు మారుతుంది...లేదా సంగంజాగర్లమూడి రోడ్డులోని మరో ఇంటికి చేరుతుంది. పేకాట మాత్రం కామన్‌. మెడలో చైన్‌, జేబులో నోట్లు, కారు లేదా హీనపక్షం బైక్‌ కలిగిన సంపన్నులు, వ్యాపారవర్గాలకు చెందిన వ్యసనపరులకు మాత్రమే అక్కడ ప్రవేశం! యడ్లపల్లి పరిసరాల్లోని వారు, తెనాలిలోని కూటమిలోని ఒక పార్టీ నాయకులు, గుంటూరుకు చెందిన పేకాటరాయుళ్లు నిత్యం అక్కడ కలుస్తుంటారు. సెల్‌ఫోన్‌ వాట్సాప్‌ గ్రూపుల్లో వచ్చే సమాచారమే అందరికీ సంధానకర్త. కొత్తవారికి అక్కడ ప్రవేశం నిషిద్ధం. చిల్లర ఆటగాళ్లకు అటుకేసి కన్నెత్తి చూసే ధైర్యం ఉండదు. వాహనాలను గ్రామంలోని రోడ్లపైనే అక్కడక్కడా నిలిపిఉంచుతారు.

అధికార పార్టీ నేతల అండదండలతో..

అధికార కూటమి పార్టీకి చెందిన యడ్లపల్లికి చెందిన ఓ వ్యక్తికి పేకాట నిత్యకృత్యం. గతేడాది సంక్రాంతి సందర్భంగా చుండూరు మండలంలోని కేఎన్‌ పల్లి వద్ద కోడిపందేలు, పేకాట బరిని నిర్వహించారు. మళ్లీ ఈ సంవత్సరం సంక్రాంతికి కోడిపందేలను మినహాయించి, పేకాటకే అతడిని సరిపెట్టినట్టు తెలిసింది. వీటికి ముందుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో సంగం జాగర్లమూడి రోడ్డులో కోడిపందేలను నిర్వహించి, చూసేందుకు వచ్చిన ఔత్సాహికుల నుంచి రూ.100 చొప్పున ‘వినోద పన్ను’ వసూలుచేసిన ఘనాపాఠి ఆ కూటమి ఛోటానేత!. ఈసారి తెనాలి త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషను పరిధిలోని తమకు అనుకూలంగా లేకపోవటంతో కూటమికి చెందిన స్థానిక నాయకుడు, యడ్లపల్లి తెలుగు తమ్ముడితో చేతులు కలిపి ఆ గ్రామంలో పేకాట కేంద్రం తెరిచారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఆశీర్వాదం లేకుంటే అంత భారీస్థాయిలో పేకాట జరగదని ఎవరైనా చెబుతారు. పెద్దల ఆశీస్సులుంటే పోలీసులు మటుకు ఎందుకు ఊరుకుంటారు! చివరకు జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వాల్సిన ఎస్‌బీ పోలీసులు కూడా మౌనం వహిస్తున్నారంటే క్రమం తప్పక అందుతున్న మామూళ్లేనని జనం చర్చించుకుంటు న్నారు. ఎవరైనా తెగించి పోలీసులకు ఫోన్‌ చేసినా, నిముషాల వ్యవధిలో పేకాట నిర్వాహకులకు తెలిసిపోతోందని కూడా చెబుతున్నారు. దీంతో లేనిపోని తంటా ఎందుకు? అనుకుంటూ స్థానికులు మౌనరాగానికి పరిమితమయ్యారు.

ఖాకీలు కన్నెత్తి చూడరు..!

ఇంత భారీస్థాయిలో నిర్విఘ్నంగా పేకాట జరుగుతున్నా పోలీసులు అటుకేసి చూడటం లేదు. ఎవరైనా ఫిర్యాదుచేస్తే, హడావుడిగా వెళ్లి నలుగురిని పట్టుకున్నట్టు కేసు నమోదుచేస్తున్నారు. మళ్లీ షరా ‘మామూలే’! ఇదంతా పేకాట నిర్వాహకులు, పోలీసుల మధ్య అవగాహనతోనే జరుగుతోందనే ఆరోపణలున్నాయి. చుండూరు ఎస్‌ఐగా మహిళా అధికారిణి ఉన్నారు. జిల్లా ఎస్పీకి సమాచారం ఇవ్వాల్సిన స్పెషల్‌బ్రాంచి పోలీసులు నుంచి చుండూరు పోలీసు అధికారుల వరకు ఎవరి వాటా వారికి అందుతుందని, అందుకే అంత ధైర్యంగా పేకాట జరుగుతోందని బహిరంగంగానే వినిపిస్తోంది. పేకాట ఆటగాళ్లకు అవసరమైన వాటర్‌ బాటిళ్లు, సిగరెట్లు, కూల్‌డ్రింక్స్‌కు అక్కడ విపరీతమైన డిమాండ్‌ ఉంటోంది. ఆ చిరువ్యాపారులకే కాదు.. అక్కడ ఏస్థాయిలో పేకాట జరుగుతుందనేది గ్రామస్తుల్లో చాలామందికి తెలుసు.

Advertisement
 
Advertisement
Advertisement