డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్, జూదం, లోన్ యాప్‌లను నిషేధించాలి
లక్ష్మీపురం: యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, బెట్టింగ్, జూదం, లోన్‌యాప్‌లను నిషేధించాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న డిమాండ్ చేశారు. బ్రాడీపేటలోని డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యాలయంలో నిరుద్యోగ సమస్యపై చర్చా ఆదివారం నిర్వహించారు. రామన్న మాట్లాడుతూ ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు సంత్సరానికి రెండు కోట్లు ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసిందని గుర్తు చేశారు. ఇటీవల సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నిరుద్యోగులపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా నిరుద్యోగులు తమ గళాన్ని విప్పారన్నారు. యువతకు ఉపాధి కల్పించే బాధ్యత నుంచి ప్రభుత్వాలు పక్కకు తప్పుకోవడం వలనే ఇటువంటి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర పభ్రుత్వాలు ప్రభుత్వ సంస్థల్లో ఖాళీలుగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం లేదని, కీలక రంగాలు అయిన ఆర్మీలో కూడా కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడం చూస్తుమని చెప్పారు. ఈ కాలంలో రైల్వేలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకు సిబ్బంది కొరత ప్రధాన కారణం అన్నారు. అన్ని ప్రభుత్వ రంగం సంస్థల్లో ఖాళీల భర్తీ చేయడం నిలిపి వేసి నిరుద్యోగ సైన్యాన్ని ప్రభుత్వాలే తయారు చేస్తున్నాయని విమర్శించారు. మరో వైపు నిరుద్యోగ యువత బెట్టింగ్, జూదం, లోన్లు యాప్‌ల వల్ల ఆర్థికంగా నష్టపోయి ప్రాణాలను తీసుకుంటున్నారని ఆరోపించారు. డ్రగ్స్, గంజాయిని నిర్మూలించి యువతన కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. క్రీడా అభివృద్ధికి నిధులు మంజూరు చేసి యువతలో క్రీడలవైపు ఆకర్షించే విధంగా కృషి చేయాలన్నారు. సంఘం జిల్లా కార్యదర్శి వై.కృష్ణకాంత్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిరుద్యోగులను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి.లక్ష్మణరావు, ఐద్వా నగర కార్యదర్శి ఎ.కళ్యాణి, ఎల్‌ఐసీ ఏజెంట్ల సంఘం నాయకులు జి.రామ్‌మోహన్‌రావు, మెడికల్ రిప్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సలీమ్, కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు, జాషువా విజ్ఞాన కేంద్రం కార్యక్రమాల కమిటీ కన్వీనర్ ఎన్.భావన్నారాయణ, ట్రన్స్‌పోర్టు నాయకులు ఎస్.ఖాశిం షహీద్ పాల్గొన్నారు.


