వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు జీఎంసీ డివిజన్ల పునర్విభజనపై అభ్యంతరాల సమర్పణ
నెహ్రూనగర్: స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు తెలియజేశారు. డివిజన్ల పునర్విభజన ప్రక్రియపై అభ్యంతరాలను తెలిపేందుకు శనివారం వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా, గుంటూరు నగర మాజీ డిప్యూటీ మేయర్, తాడికొండ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు(డైమండ్ బాబు)లు పట్టణ ప్రణాళిక విభాగం అసిస్టెంట్ సిటీ ప్లానర్ జాకీరాను కలిసి 21 అభ్యంతరాలను తెలిపారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ ఇటీవల విడుదలైన పునర్విభజన డ్రాఫ్ట్ పబ్లికేషన్‌పై అభ్యంతరాలను తెలిపేందుకు నగరపాలక సంస్థకు వచ్చామన్నారు. ఆదివారం సాయంత్రం వరకు అవకాశం ఉండటంతో పార్టీ మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, నగర వాసులు అభ్యంతరాలను చెబితే ఆదివారం సాయంత్రం వాటి వివరాలను మళ్లీ అందజేస్తామన్నారు. నిబంధనల ప్రకారం పునర్విభజన జరుగుతుందని ఆశిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


