గుక్కెడు నీరూ గరళమే... | - | Sakshi
Sakshi News home page

గుక్కెడు నీరూ గరళమే...

May 23 2026 1:40 AM | Updated on May 23 2026 1:40 AM

గ్రామ ప్రజలకు నిత్యం శుద్ధి చేయని నీటి సరఫరా

ప్రత్తిపాడులో పని చేయని మూడు ఫిల్టర్‌బెడ్లు

మైక్రో ఫిల్టర్‌ పని చేస్తున్నా

వినియోగంలో అంతులేని నిర్లక్ష్యం

చర్మ వ్యాధులు, ఇతర రోగాల బారిన పడుతున్న ప్రజలు

చంద్రబాబు సర్కారు వైఖరితో నిత్యం తీవ్ర అవస్థలు

రంగు మారి దుర్వాసన వస్తున్నా...

ప్రతిపాదనలు పంపాం

గుక్కెడు శుద్ధిచేసిన తాగునీరు అందించడంలోనూ చంద్రబాబు పాలనలో సాధ్యం కావడం లేదు. అటు ప్రజాప్రతినిధుల తీరు, ఇటు అధికారుల అంతులేని నిర్లక్ష్యం వెరసి ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. సిబ్బంది కొరత సాకుతో పంచాయతీ అధికారులు పనిచేస్తున్న మైక్రో ఫిల్టర్‌ను నిరుపయోగంగా వదిలేశారు. నిర్వహణ బాధ్యత పంచాయతీదే.. మేం సాంకేతిక సహకారం మాత్రం ఇస్తామంటూ ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు చేతులు దులుపుకొంటున్నారు. ప్రజలకు శుద్ధి చేయకుండానే నీటిని అందిస్తుండటంతో వారు రోగాలబారిన పడుతున్నారు.

ప్రత్తిపాడు: ‘ఇక వన్‌ ఎంఎల్‌డీ (మిలియన్‌ లీటర్‌ పర్‌ డే) మైక్రో ఫిల్టర్‌ ఏర్పాటు చేస్తున్నాం... ఈ రోజుతో ప్రత్తిపాడుకు తాగునీటి సమస్య తీరిపోతుంది. రోజూ సురక్షిత శుద్ధజలం గ్రామంలోకి సరఫరా చేస్తారు. రా వాటర్‌ సరఫరా చేసే సమస్య ఉండదు....’ ఇవీ నాలుగేళ్ల క్రితం మైక్రో ఫిల్టర్‌ ప్రారంభం సమయంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖ డీఈ స్థాయి అధికారి చెప్పిన మాటలు. ప్రస్తుతం ఆయన మాటలు నీటి మీద రాతలేనని తేలిపోయింది. ప్రత్తిపాడు మేజర్‌ గ్రామ పంచాయతీలో 14 వేల మంది జనాభా నివసిస్తున్నారు. రక్షిత మంచి నీటి పథకం కింద మూడు ఫిల్టర్‌ బెడ్లు, వన్‌ ఎంఎల్‌డీ మైక్రో ఫిల్టర్‌ ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి రోజూ గ్రామంలోనికి తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. రకరకాల సాకులు చూపుతూ మూడు రోజులకోసారి గ్రామంలోనికి రా వాటర్‌ సరఫరా చేస్తున్నారు.

మూడు ఫిల్టర్‌ బెడ్లు మూలకు..

పేరుకు ప్రత్తిపాడు పంచాయతీలో మూడు పెద్ద ఫిల్టర్‌ బెడ్లు ఉన్నాయి. కానీ వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా పని చెయ్యడం లేదు. రకరకాల కారణాలతో కొన్ని సంవత్సరాలుగా ఫిల్టర్‌ బెడ్‌లను నిరుపయోగంగా వదిలేశారు. ఫిల్టర్‌బెడ్లు పూర్తిగా మరమ్మతులకు గురయ్యాయి. వాటిలో ఉన్న నీరు రంగు మారి, పాచి పట్టి, పురుగులతో నిండాయి. దుర్వాసన వెదజల్లుతూ అధికార యంత్రాంగం తీరును వెక్కిరిస్తూ దర్శమిస్తున్నాయి.

వినియోగంలో అలసత్వం

గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ప్రత్తిపాడులో ప్రజలకు రా వాటర్‌ నుంచి విముక్తి కల్పించి, సురక్షిత శుద్ధ జలం అందించేందుకు అప్పటి మంత్రి మేకతోటి సుచరిత ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రూ. 15 లక్షల వ్యయంతో వన్‌ ఎంఎల్‌డీ మైక్రో వాటర్‌ ఫిల్టర్‌ని మంచి నీటి చెరువు కట్టపై నిర్మించారు. ఈ ఫిల్టర్‌ ద్వారా రోజుకు పది లక్షల లీటర్ల నీరు ఫిల్టర్‌ అవుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక మనిషికి రోజుకు 55 లీటర్ల నీటిని అందించాలి. ఈ లెక్కన 13,800 మందికి గాను 7.50 లక్షల నీరు ఇవ్వాలి. అంటే మైక్రో ఫిల్టర్‌ను సక్రమంగా వినియోగిస్తే తాగునీటి సమస్యకు చెక్‌ పెట్టవచ్చు. ఫిల్టర్‌ ప్రస్తుతం పని చేస్తున్నా సిబ్బంది కొరత కారణం చూపుతూ కనీసం వినియోగించడం మానేశారు.

రంగు మారిన నీరు దుర్వాసన వస్తుండటంతో ప్రజలు వాటినే తాగాల్సిన దౌర్భాగ్యం పట్టింది. పాచిపట్టినా.. రంగుమారినా.. దుర్వాసన వస్తున్నా.. పురుగులు తేలియాడుతున్నా.. పట్టించుకునే నాథులే కరవయ్యారు. అవే నీటిని పంచాయతీ అధికారులు గ్రామంలోనికి సరఫరా చేస్తుండటంతో కలుషిత నీటితో ప్రజలు గొంతు తడుపుకోవాల్సి వస్తోంది. పల్లె ప్రజలు గొంతులో విషం నింపుతున్నారు. ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అధికారులకు ప్రజల బాధలు చెవికెక్కడం లేదు. ఆర్థిక స్థోమత ఉన్న వారు ఆర్వో ప్లాంట్ల వద్ద తాగునీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. గత్యంతరం లేని వారు రా వాటర్‌నే తాగాల్సి వస్తోంది.

పనిచెయ్యని ఫిల్టర్‌బెడ్‌ల మరమ్మతుల నిమిత్తం రూ. 80 లక్షలతో ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపించాం. స్థానిక సంస్థల నిధులతో మరమ్మతులు చేయాలని సూచించారు. మైక్రో ఫిల్టర్‌ను రోజుకు 20 గంటలు వినియోగిస్తే గ్రామమంతా సురక్షిత నీరు సరఫరా చేయవచ్చు. కానీ ఆ బాధ్యత గ్రామ పంచాయతీదే.

– వినీల్‌, ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌

Advertisement
 
Advertisement
Advertisement