మామిళ్లపల్లి రైతు పరామర్శకు అడ్డంకులు | - | Sakshi
Sakshi News home page

మామిళ్లపల్లి రైతు పరామర్శకు అడ్డంకులు

May 23 2026 1:40 AM | Updated on May 23 2026 1:40 AM

మామిళ్లపల్లి రైతు పరామర్శకు అడ్డంకులు

పొన్నూరు: రైతులను పరామర్శించేందుకు మామిళ్లపల్లి వస్తున్న మాజీ డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతిని బుధవారం పోలీసులు అడ్డుకున్నారు. వివరాలు.. టీడీపీ నాయకుల దాడిలో నష్టపోయి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎదుర్కొంటున్న పొన్నూరు మండలం మామిళ్లపల్లికి చెందిన 14 మంది మొక్కజొన్న రైతులను పరామర్శించి సంఘీభావం తెలిపేందుకు గ్రామానికి వస్తున్న వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర నాయకులు, మాజీ డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతిని గ్రామ అడ్డరోడ్డు వద్ద రూరల్‌ సీఐ కృష్ణయ్య, ఎస్‌ఐ శ్రీహరి అడ్డుకున్నారు. గ్రామంలోకి వెళ్లడానికి వీల్లేదని చెప్పడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసులపై ఆగ్రహం..

ఈ సందర్భంగా కోన రఘుపతి రైతుల పరామర్శను అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. టీడీపీ మూకల దాడిలో నష్టపోయిన రైతులను పరామర్శించడం నేరమా, లేక తప్పిదమా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. రైతులకు అన్యాయం జరిగితే వైఎస్సార్‌ సీపీ అండగా నిలుస్తుందని చెప్పారు. ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరును రైతులు కూడా గమనించాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌బీకే వ్యవస్థ నిర్వీర్యమైందని విమర్శించారు. గిట్టుబాటు ధర లేక రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని, ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరవాలని సూచించారు. మామిళ్లపల్లి గ్రామంలో రైతులకు జరుగుతున్న అన్యాయానికి గురైన రైతులకు అండగా నిలిచిన వైఎస్సార్‌ సీపీని పోలీసులను అడ్డుపెట్టుకుని ఉక్కుపాదంతో అణగదొక్కేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు.

ఇక్కడ జరిగిన ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. గ్రామంలోకి వెళ్లనీయకుండా బారికేడ్లు అడ్డుపెట్టి అడ్డుకోవడం, దానికి పోలీసులను ఉపయోగించడం ఏంటని ప్రశ్నించారు. రైతులకు సంబంధించిన విషయాన్ని రెవిన్యూ యంత్రాంగంతో పరిష్కరించాల్సి ఉండగా, పోలీసులతో అడ్డుకోవడం ఎందుకని అన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా గ్రామంలో సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించరాదని పోలీసులు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణకు నోటీసులు ఇచ్చారు.

మాజీ డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతిని అడ్డగిస్తున్న పోలీసులు

Advertisement
 
Advertisement
Advertisement