విదేశాల్లోనూ అభిమానులు ..
నాలుగు వేల కాయల వరకు దిగుబడి...
భ్రమరాంబ గారి చెట్టు
మున్నంగి(తెనాలి): ఆవకాయ రుచి చూడని తెలుగువారు ఉండరు. తెలుగిళ్లలో వేసవితోనే ఆవకాయ ప్రణాళిక ఆరంభమవుతుంది. ఇంటి ఇల్లాళ్లు అవసరమైన సంబారాలు సిద్ధం చేసుకుంటూనే, మామిడికాయ ఎంపికపై శ్రద్ధ పెడతారు. కొల్లిపర ప్రాంతం వారికి మాత్రం ‘భ్రమరాంబ చెట్టు మామిడికాయ’ గుర్తుకొస్తుంది. ఆవకాయ ప్రియులకు ఆ చెట్టు పేరు వినగానే నోరూరుతుంది. పరిసరాల్లోని గ్రామాలే కాదు...కృష్ణా జిల్లాలోని వారికీ ఆ చెట్టుకాయ రుచి సుపరిచితం. గ్రామానికి చెందిన ఎన్నారైలు వీటిి రుచి చూడకుండా వదలరు సుమా!
భ్రమరాంబ చెట్టు పుట్టు పూర్వోత్తరాలకు వెళితే, గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలోకి చూడాలి. ఊరి వెలుపల పంట పొలంలో దాదాపు పది సెంట్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉందీ చెట్టు. ఆరు దశాబ్దాల కిందట బొంతు చెంచారెడ్డి ఉత్తరాది నుంచి ఈ మొక్కను తీసుకొచ్చి నాటారు. చెంచారెడ్డి భార్య భ్రమరాంబ పచ్చడి మామిడి చెట్టు అనగానే అంతా నిరుత్సాహపడ్డారు. కాపు కాయటం మొదలుపెట్టీ, ఆవకాయగా రూపాంతరం చెందాక రుచి చూసినవారంతా వహ్వా! అనేశారు. అప్పటి నుంచి ఆ చెట్టుకు మహర్దశ పట్టింది. భ్రమరాంబ గారి చెట్టుగా పేరు స్థిరపడిపోయింది.
వేసవికాలం వచ్చిందంటే ఆవకాయ పచ్చడి ప్రియులు అందరూ భ్రమరాంబగారి చెట్టు కాయల కోసం అడుగుతుంటారు. ఈ కాయలతో చేసిన ఆవకాయ పచ్చడి ఏడాది కాలమైనా తాజాగా ఉంటుందట! ఏడాది తర్వాత తిన్నా...ముక్క మెత్తపడకుండా కరకరలాడుతూ తాజాగా ఉండటం ప్రత్యేకతగా చెబుతారు. ఈ కాయల కోసం కొల్లిపర మండల గ్రామాల నుంచే కాకుండా దుగ్గిరాల, తాడేపల్లి మండలాలు, బాపట్ల, తెనాలి, కృష్ణాజిల్లాల నుంచి కూడా తెలిసినవారు ఏటా కారులలో వచ్చి తీసుకుని వెళతారు.
ఈ కాయల పచ్చడికి విదేశాల్లోనూ డిమాండ్ ఉంది. మున్నంగి గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు, గుండె వైద్యనిపుణులు డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి ఈ చెట్టు పచ్చడికి పెద్ద అభిమానిగా గ్రామానికి చెందిన బొంతు బాపిరెడ్డి చెప్పారు. ప్రతి సంవత్సరం ఆయన అమెరికా తీసుకుని వెళతారు. కుదరకపోతే కొరియర్‌లో పంపాల్సిందేనట! అక్కడ తన మిత్రులందరికీ ఆ ఊరి ఆవకాయను రుచి చూపిస్తుంటారు.
అలా మున్నంగి గ్రామంలోని ఈ చెట్టు చెంచారెడ్డి–భ్రమరాంబ కుమారుడు శివరామిరెడ్డి పర్యవేక్షణలో ఉంది. ఆయనకు ఇద్దరు సంతానం. కొడుకు శరత్‌రెడ్డి ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. కుమార్తె జ్యోతి కృష్ణాజిల్లాలో టీచరు వృత్తిలో ఉన్నారు. ఆస్తులన్నీ పంచేశారు. ప్రస్తుతం మామిడిచెట్టు ఉన్న స్థలం కొడుకు శరత్‌రెడ్డికి వెళ్లింది. ఆలనా పాలనా శివరామిరెడ్డి చూస్తున్నారు. ఏటా వర్షాలు రాగానే వానపాముల ఎరువు, నైపోగు ఎరువు వేస్తానని చెప్పారు. ఏటా వేసవిలో నాలుగు వేల కాయల వరకు దిగుబడి వస్తుందని చెప్పారు. ఇదిలా ఉంటే శాఖోపశాఖలుగా విస్తరించిన ఆ మామిడిచెట్టు కొంతకాలం క్రితం వరకు వేసవిలో గ్రామ యువతకు పెద్ద ఆటవిడుపు. ఇప్పుడు ఎక్కువమంది నగరాల బాట పట్టటంతో ఆ సందడి కరవైంది.
పది సెంట్ల విస్తీర్ణంలో
భారీ మామిడిచెట్టు
60 ఏళ్లయినా ఏటేటా అదే కాపు
ఏడాది గడచినా తాజాగా పచ్చడి
వేసవి వస్తే ఆ కాయలకు డిమాండ్


