ఆంగ్రూ వీసీగా బాపట్ల పూర్వవిద్యార్థి | - | Sakshi
Sakshi News home page

ఆంగ్రూ వీసీగా బాపట్ల పూర్వవిద్యార్థి

Apr 25 2026 8:00 AM | Updated on Apr 25 2026 8:00 AM

బాపట్ల టౌన్‌: ఆచార్య ఎన్‌.జి. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం నూతన ఉప కులపతిగా బాపట్ల వ్యవసాయ కళాశాల 1983 బ్యాచ్‌ విద్యార్థి డాక్టర్‌ పాలడుగు వెంకట సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఏజీ విశ్వవిద్యాలయంలో కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ పి. ప్రసూనరాణి ఆధ్వర్యంలో అధ్యాపకులు సత్యనారాయణను శాలువాతో సత్కరించారు. ప్రసూనారాణి మాట్లాడుతూ బాపట్ల వ్యవసాయ కళాశాలలో 1983లో బీఎస్సీ చేరి, అంచలంచెలుగా ఎదిగి, పరిశోధన సంచాలకులు స్థాయికి సత్యనారాయణ చేరుకున్నారన్నారు. 40కిపైగా అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలు రూపొందించి ఆంధ్ర రైస్‌ మాన్‌గా పేరు సాధించారని తెలిపారు.

జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు మొబైల్‌ వ్యాన్‌

గుంటూరు లీగల్‌: ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర న్యాయ సేవా సంస్థ అందజేసిన మొబైల్‌ లీగల్‌ అవేర్‌నెస్‌ వ్యాన్‌ను గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్‌ చక్రవర్తి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కోర్టు న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్‌ జియావుద్దీన్‌ పాల్గొన్నారు. ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్‌ చక్రవర్తి మాట్లాడుతూ మొబైల్‌ వ్యాన్‌ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. పేద, బలహీన వర్గాలకు న్యాయ సేవలు సులభంగా అందుబాటులోకి తీసుకువడానికి ఈ వ్యాన్‌ కీలకంగా మారనుందని తెలిపారు.

ఐదు వెండి గంగాళాలు బహూకరణ

పెదకాకాని: స్థానిక మల్లేశ్వరస్వామి వారి నిత్యాభిషేక సేవకు వినియోగించేందుకు 1.174 కిలోల తూకం కలిగిన ఐదు వెండి చిన్న గంగాళాలను చినకాకాని గ్రామానికి చెందిన రావెళ్ళ సత్యనారాయణ దంపతులు బహూకరించారు. వీటిని శుక్రవారం ఉప కమిషనరు గోగినేని లీలాకూమార్‌కు అందజేశారు. ఉచిత అన్నప్రసాద వితరణకు విశాఖపట్నానికి చెందిన ఎం.నారాయణ, శివపార్వతి దంపతులు రూ. 40 వేలు, గుంటూరుకు చెందిన చింతా రవీంద్రరెడ్డి, సునీత దంపతులు రూ.60 వేలు విరాళంగా అందించినట్లు ధర్మకర్తల మండలి చైర్మన్‌ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. దర్మకర్తల మండలి సభ్యుడు దూపాటి శివశంకరరావు సిబ్బంది పాల్గొన్నారు.

దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణం

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగానే కనిపించింది. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు ఓ మోస్తరు రద్దీ కనిపించగా, సాయంత్రం ఆరు గంటల నుంచి సాధారణ భక్తుల తాకిడి కనిపించింది. మరో వైపున తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఉదయం ఆలయంలో జరిగే లక్ష కుంకుమార్చన, చండీయాగం, శ్రీచక్ర నవార్చన వంటి ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. రద్దీ సమయాల్లో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసి, శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉండటంతో మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తిరిగి ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement