రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలింపు
నగరంపాలెం(గుంటూరువెస్ట్): గంజాయి, మాదక ద్రవ్యాల క్రయ, విక్రయాలు, అక్రమ రవాణా చేసే ఓ యువ మహిళపై పీడీ ఎన్‌డీపీఎస్ చట్టం ప్రయోగించి రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు. తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని తాడేపల్లి టౌన్‌లో ఉంటున్న 26 ఏళ్ల వి.నాగమణి గంజాయి క్రయ, విక్రయాలు, నిల్వలు, రవాణా చేస్తున్నట్లు పోలీసు లు గుర్తించారు. దీంతో ఆమైపె నాలుగు కేసులు నమోదై ఉన్నాయి. ఆమైపె కేసులు నమోదు చేసినా ఆమెలో మార్పురాలేదు. ప్రజా భద్రత దృష్ట్యా ఆమెను నిర్బంధించడమే సరైన చర్యగా పోలీసులు భావించారు. దీంతో నాగమణిపై పీడీ చట్టం ప్రయోగించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ద్వారా తాడేపల్లి పీఎస్ సీఐ వీరేంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీడీ చట్టం అమలుకు ఉత్తర్వులు జారీ చేయగా, ఆమెను రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించారు.
గుంటూరు ఎడ్యుకేషన్ : ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మలి విడత ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈనెల 25, 26, 27 తేదీల్లో విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ కె.నరసింహారావు పిలుపునిచ్చారు. శుక్రవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఫ్యాప్టో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 26న గుంటూరు జిల్లా నుంచి రిలే నిరాహారదీక్షకు జిల్లా ఫ్యాప్టో నాయకులు, కార్యకర్తలు, ఫ్యాప్టో పోరుబాటకు మద్దతిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా కృషి చేయాలని జిల్లా ఫ్యాప్టో కార్యవర్గం పిలుపునిచ్చింది. సమావేశంలో గుంటూరు జిల్లా ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ యు.రాజశేఖర్, జి.దాసు, ఫ్యాప్టో జిల్లా కార్యవర్గ సభ్యు లు ఎం.కళాధర్, షేక్ బాజీ,ప్యాప్టో జిల్లా నాయకులు జి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
మంగళగిరిటౌన్: ఓ యువతి సమయస్ఫూర్తితో అర్ధరాత్రి ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆటోడ్రైవర్ అసభ్య ప్రవర్తనకు పాల్పడుతుండగా పోలీసులకు సమాచారం అందించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ యువతిని పోలీసులు రక్షించారు. ఈ ఘటన మంగళగిరి మండలంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... పెదకాకాని మండలం నంబూరు గ్రామానికి చెందిన ఓ యువతి బాపట్లలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో నాల్గవ సంవత్సరం చదువుతోంది. ఇంటర్నషిప్ కోసం బెంగళూరు వెళ్లింది. తాను చదివే కళాశాలలో శుక్రవారం జరిగే పరీక్షకు హాజరయ్యేందుకు 23వ తేదీ ఉదయం బెంగళూరు నుంచి బస్సులో బయలుదేరింది. మధ్యాహ్నానికి కుప్పం చేరుకుంది. కుప్పం రైల్వేస్టేషన్‌లో విజయవాడకు వెళ్లే శాతవాహన రైలు ఎక్కి గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు విజయవాడ చేరుకుంది. రైల్వేస్టేషన్ నుంచి ఆటోలో బస్టాండ్‌కు చేరుకుంది. బస్సు కోసం ఎదురు చూడసాగింది. ఎంతసేపటికీ బస్సులు రాకపోవడంతో తన తండ్రికి ఫోన్ చేసింది. ఆరోగ్యం బాగోలేదంటూ కాజ టోల్‌గేటు వరకు వస్తే అక్కడ ఎదురు చూస్తానని తండ్రి చెప్పాడు. విజయవాడ బస్టాండ్‌లో ఓ ఆటో డ్రైవర్ యువతి వద్దకు వచ్చి ఎక్కడికి వెళ్లాలంటూ అడిగాడు. అవసరం లేదు.. బస్సులో వెళతానని యువతి బదులిచ్చింది. జాగ్రత్తగా తీసుకువెళతానంటూ ఆటో డ్రైవర్ యువతిని నమ్మబలికి ఆటో ఎక్కించాడు. విజయవాడ కనకదుర్గ వారధి దాటిన తరువాత ఆటోడ్రైవర్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. దీంతో యువతికి భయం వేసి ఫోన్‌లో శక్తి యాప్‌ను ఇస్టాల్ చేసుకుని వివరాలను యాప్ ద్వారా పోలీసులను అలర్ట్ చేసింది. ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించసాగాడు. పరిస్థితి ప్రమాదకరంగా మారుతోందని గమనించిన యువతి మధ్యమధ్యలో ఫోన్‌లు చేస్తూ ఉంది. పోలీస్ ఉన్నతాధికారుల నుంచి స్థానిక పోలీసులకు సమాచారం వచ్చింది. స్థానిక పోలీసులు యువతికి ఫోన్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉన్నారు. మంగళగిరి దాటిన తరువాత చినకాకాని సమీపంలో ఆటోను వేరే మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేశాడు. యువతి పెద్దగా కేకలు వేయడంతో డ్రైవర్ మధ్యమధ్యలో ఆపుతూ వెళ్లాడు. అప్పటికే యువతి లొకేషన్ తెలుసుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వస్తున్నారని గమనించిన ఆటో డ్రైవర్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఎస్‌ఐ వెంకట్ తన సిబ్బందితో ఆటోను వెంబడించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. యువతిని సురక్షితంగా స్వస్థలానికి చేర్చారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ తాడేపల్లి సీతానగరానికి చెందిన బోయిన ఫణీంద్రగా పోలీసులు గుర్తించారు.


