గుంటూరు వెస్ట్: సీఆర్‌డీఏ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సీఎం.సాయికాంత్ వర్మ తెలిపారు. సీఆర్‌డీఏ, రెవెన్యూ శాఖల సమన్వయ సమావేశం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో శుక్రవారం జరిగింది.
● జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నగరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణానికి చర్యలు చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలో సీఆర్‌డీఏ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం అవసరమని స్పష్టం చేశారు. భూ సంబంధిత అంశాలకు చెందిన దస్త్రాలు సంబంధిత ప్రతిపాదనలు తహసీల్దార్, రెవెన్యూ డివిజనల్ అధికారుల ఆధ్వర్యంలో జరగాలన్నారు. భూ సేకరణ అధికారులు భూ సేకరణకు అవసరమయ్యే నోటిఫికేషన్లు, నోటీసులు జారీ చేయడంలో నిర్దిష్టమైన నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలని సూచించారు. భూ సేకరణ ప్రక్రియలో నిబంధనలను పక్కాగా పాటించాలన్నారు.
● సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ భార్గవ తేజ మాట్లాడుతూ 8,352.69 చదరపు కిలోమీటర్ల పరిధిలో సీఆర్‌డీఏ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ భూమి, బంజరు, ఇనాం, దేవదాయ, నీటిపారుదల తదితర భూముల కేటగిరీ వారీగా కార్యాచరణ ప్రణాళికలు అవసరం అని వివరించారు. సమావేశంలో గుంటూరు, పల్నాడు జాయింట్ కలెక్టర్‌లు అశుతోష్ శ్రీవాస్తవ, సంజనా సింహ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, తెనాలి ఇన్ చార్జి సబ్ కలెక్టర్ లక్ష్మీకుమారి, ఆర్డీఓ కె.శ్రీనివాస రావు, సీఆర్‌డీఏ భూ సేకరణ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ సీఎం.సాయికాంత్ వర్మ


